మొక్కలకు మాటలొస్తే ఎలా ఉంటుంది? డబ్లిన్ శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ!
ఆ తర్వాత మరికొందరు శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి మొక్కలు తమలో తాము మాట్లాడుకుంటాయని, భావాలను కూడా పంచుకుంటాయని కనుగొన్నారు.;
ఒకప్పుడు మొక్కలకు ప్రాణం లేదని అంతా అనుకునేవాళ్లు. కానీ దాదాపు వందేళ్ల క్రితం, జగదీశ్ చంద్రబోస్ అనే గొప్ప శాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అవి సూర్యకాంతిని ఆహారంగా తీసుకుంటాయని, గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని మనకు ప్రాణవాయువును అందిస్తాయని తెలిపారు. అంతేకాకుండా మొక్కలు కూడా హానికరమైన రసాయనాలకు ప్రతిస్పందిస్తాయని, వాటిలోనూ ఒక రకమైన నాడీ వ్యవస్థ ఉంటుందని వారి పరిశోధనల్లో తేలింది.
ఆ తర్వాత మరికొందరు శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి మొక్కలు తమలో తాము మాట్లాడుకుంటాయని, భావాలను కూడా పంచుకుంటాయని కనుగొన్నారు. అంటే ఇక మొక్కలు కూడా మనుషుల్లాగా మాటలు చెబుతాయా? అని ఆశ్చర్యపోయిన వారికి సమాధానం ఇస్తూ, డబ్లిన్‌లోని శాస్త్రవేత్తలు నిజంగానే ఒక "మాట్లాడే చెట్టు"ను క్రియేట్ చేశారు. ట్రినిటీ కాలేజీలో రూపొందించిన ఈ వినూత్న ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మనలో ఉన్న చాలా మందికి ఓ తీరని కోరిక ఉంటుంది. చెట్లు, మొక్కలు మనతో మాట్లాడితే ఎంత బాగుంటుందో అని! అవి మనకు ఏం చెబుతాయో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. మన ఈ ఉత్సాహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ట్రినిటీ కాలేజీ ప్రాంగణంలోని ఒక చెట్టుతో మనం నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. దీని కోసం వారు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించారు.
డ్రోగా5 టెక్నాలజీ సంస్థ, బ్రిటన్‌లోని ఏజెన్సీ ఫర్ నేచర్ కలిసి ట్రినిటీ కాలేజీలోని 20ఏళ్ల వయస్సున్న ఒక లండన్ ప్లేన్ చెట్టుకు ఒక "గొంతు"ను అందించాయి. శాస్త్రవేత్తలు ఏఐ, ఆధునిక సెన్సార్లను ఆ చెట్టుకు అనుసంధానించారు. ఈ సెన్సార్లు చెట్టు మొదలు వద్ద ఉన్న నేలలోని తేమ, పరిసర ఉష్ణోగ్రత, సూర్యకాంతి తీవ్రత, గాలి నాణ్యత వంటి కీలకమైన అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఈ సమాచారాన్ని ఒక ప్రత్యేకమైన ఆర్టిఫీషియల్ భాషా నమూనాకు పంపిస్తాయి. ఆ నమూనా చెట్టు అనుభూతిని విశ్లేషించి, దానిని మానవులు అర్థం చేసుకునే మాటల రూపంలో వినిపిస్తుంది.
ఒకవేళ చెట్టుకు నీరు అవసరమైతే దాని వేళ్లు దాహంతో బాధపడుతుంటే "నీళ్లు... నీళ్లు... కాస్త నీళ్లు పోయండి!" అని అడగవచ్చు! లేదా అది పోషకాలు కోల్పోయి ఆకలితో ఉంటే, "దయచేసి ఎవరైనా కొంచెం ఎరువు వేయండి!" అని అడగవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చెట్లకు భవిష్యతును కూడా ఊహించే శక్తి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ టెక్నాలజీ సహాయంతో అడవుల్లో సంభవించే కార్చిచ్చు వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి మనకు హెచ్చరించే అవకాశం కూడా ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.