తమిళనాట కొత్త ‘పొత్తు’ పొడుపు.. విజయ్ తో పొత్తుకు రెడీ అంటున్న అన్నాడీఎంకే!

విజయ్ వ్యాఖ్యలతో అన్నాడీఎంకేలో కొత్త ఆశలు కనిపించాయి తమిళనాట రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.

Update: 2024-11-02 06:14 GMT

తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పేరిట హీరో దళపతి విజయ్ కొత్త పార్టీని స్థాపించారు. ఇటీవలే ఆయన పార్టీకి కేంద్రం నుంచి గుర్తింపు సైతం వచ్చింది. ఇటీవల పార్టీ తొలిమహానాడును నిర్వహించారు. తొలిమహానాడుతో విజయ్ తన సత్తాచాటాడు. మహానాడుకు వచ్చిన జనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రజలు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. సభకు రాలేకపోయిన వారంతా టీవీలకే అతుక్కుపోయారు.

మహానాడులో విజయ్ సైతం తన ప్రసంగంతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీదే విజయం అన్న ధీమాను వ్యక్తం చేశారు. కొత్త రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్.. రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే.. తొలి మహానాడులో విజయ్ మాట్లాడిన సందర్భంలో ఎక్కడ కూడా అన్నాడీఎంకే పార్టీని ఆయన విమర్శించలేదు. పూర్తిగా డీఎంకేను టార్గెట్ చేస్తూనే ఆయన ప్రసంగం సాగింది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని చెప్పారు. అదే సందర్భంలో పొత్తుల గురించి కూడా ఆలోచిస్తామని స్టేట్‌మెంట్ ఇచ్చారు.

విజయ్ వ్యాఖ్యలతో అన్నాడీఎంకేలో కొత్త ఆశలు కనిపించాయి. తమిళనాట రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రెండేళ్ల తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. దాంతో తమిళనాట కొత్త పొత్తు పొడిచే అవకాశాలు ఉన్నట్లుగానే కనిపించింది. విజయ్ అన్నాడీఎంకేను పల్లెత్తు మాట కూడా అనకపోవడంతో విజయ్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆ పార్టీ ఆరాటపడుతున్నదట. అన్నాడీఎంకే పార్టీకి ప్రస్తుతం నాయకత్వ లోపం ఉంది. పన్నీర్ సెల్వం, పళనీ స్వామి మధ్య నలిగిపోయిన పార్టీ చివరికి సెల్వంను బయటకు పంపించింది. పళనీ స్వామి చేతుల్లోనే ప్రస్తుతం పార్టీ ఉంది. అయితే.. ఆ పార్టీకి ఇంతరకు ఎలాంటి ఎదుగుదల లేకుండా పోయింది.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. విజయ్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే భవిష్యత్ ఉంటుందన్న ఆలోచనలు అన్నాడీఎంకే పార్టీలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే పొత్తు సెట్ చేసుకుని పెట్టుకోవాలని ఆరాటపడుతున్నారట. అయితే.. అన్నా డీఎంకేకు సరైన నాయకుడు లేకపోయినా కేడర్ మాత్రం విపరీతంగా ఉంది. గ్రామస్థాయి నుంచి కూడా కార్యక్రర్తలు ఉన్నారు. అయితే.. కొత్తగా స్థాపించిన విజయ్‌కి ఈ బలం కాస్త ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉన్నప్పటికీ తమిళనాట రాజకీయాలు ఇప్పుడే హాట్ హాట్‌గా మారిపోయాయి.

Tags:    

Similar News