డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల వేళ బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐపై మహిళల దాడి
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2లోని పార్క్ హయత్ ముందు ఆదివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్ని నిర్వమిస్తున్నారు.
షాకింగ్ పరిణామం ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. గతంలో పోలిస్తే.. రాత్రి వేళల్లో నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల జోరు తగ్గిందనే చెప్పాలి. తాజాగా బంజారాహిల్స్ లో నిర్వహించిన తనిఖీల వేళ.. తాగేసిన మహిళల్ని టెస్టు చేయబోయిన ఎస్ఐపై దాడికి పాల్పడిన ఉదంతం సంచలనంగా మారింది. ఆదివారం అర్థరాత్రి వేళ చోటు చేసుకున్న ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అసలేం జరిగిందంటే..
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2లోని పార్క్ హయత్ ముందు ఆదివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్ని నిర్వమిస్తున్నారు. అర్థరాత్రి 1.15 గంటల వేళలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన కారును పోలీసులు ఆపారు. కారును డ్రైవ్ చేస్తున్న మహిళకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష చేయబోయారు. అందుకు ఆమె నో చెప్పింది. అంతేకాదు.. బూతులు తిట్టటం మొదలు పెట్టారు.
సదరు కారులో ఆ మహిళతో పాటు మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. కారు డ్రైవ్ చేస్తున్న మహిళ.. హోంగార్డు ఫోన్ ను లాక్కొని నేలకేసి విసిరి కొట్టగా.. ఆ విషయాన్నిప్రశ్నించేందుకు వెళ్లిన ఎస్ఐ అవినాశ్ బాబు ధరించిన బాడీ కెమేరాను సైతం ధ్వంసం చేయటం గమనార్హం. ఈ వివాదం ఇలా నడుస్తున్న వేళలోనే.. అక్కడకు ఇద్దరు యువకులు చేరుకున్నారు. ఎస్ఐను.. పోలీసుల్ని వెనక్కి నెట్టేశారు. ఈ హడావుడిలో సదరు మహిళ కారుతో సహా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.
ఈ ఉదంతంలో సదరు యువతులు.. కారు మిస్ అయినప్పటికీ.. పోలీసులతో గొడవ పడిన ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పజెప్పారు. వారిద్దరు బేగంపేటకు చెందిన అన్నదమ్ములు (రాహుల్ సేఖని.. నిషాంత్ సేఖని)గా గుర్తించారు. వారికి పరీక్షలు నిర్వహించగా.. వారి రక్తంలో మద్యం మోతాదు 70ఎంజీ.. 20 ఎంజీ వచ్చినట్లు తేలింది. దీంతో.. వీరిద్దరిపై కేసు నమోదు చేసిన విచారిస్తున్నారు. పోలీసులపై దాడికి యత్నించి.. సదరు మహిళల గురించి ఆరా తీస్తున్నారు.