టాయిలెట్లు బంద్.. 10 గంటల ప్రయాణం తర్వాత వెనక్కి వెళ్లిన షికాగో-ఢిల్లీ విమానం
దీంతో 10 గంటలు ప్రయాణించిన విమానాన్ని తిరిగి షికాగోకే మళ్లించారు.;
మనిషికి నిత్యావసరమైనది ఏంటో తెలుసా? ‘వాష్ రూం’లే.. ఒంటికి, రెండుకు వస్తే ఆపుకోవడానికి వీల్లేదు. భూమి మీద అయితే ఎక్కడో ఒక చోట కానిచ్చేస్తాం.. అదే ఆకాశంలో అయితే ఏంటి పరిస్థితి.. విమానంలో ఉన్నప్పుడు టాయిలెట్లు అన్నీ మూసుకుపోతే ఏంటి పరిస్థితి.. షికాగో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అదే పరిస్థితి ఎదురైంది. దీంతో 10 గంటలు ప్రయాణించిన విమానాన్ని తిరిగి షికాగోకే మళ్లించారు.
షికాగో నుంచి దిల్లీ వెళ్లేందుకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు 10 గంటల ప్రయాణం తర్వాత తిరిగి షికాగో విమానాశ్రయానికి మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటనకు విమానంలోని టాయిలెట్లు పనిచేయకపోవడం కారణం అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
- విమాన ప్రయాణం మధ్యలో సాంకేతిక సమస్య
బోయింగ్ 777-337 ఈఆర్ విమానం షికాగోలోని ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి దిల్లీకి బయలుదేరింది. 340 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో పది మరుగుదొడ్లు ఉన్నాయి. కానీ, ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపట్లోనే వీటిలో కేవలం ఒక్కటి మాత్రమే పనిచేస్తుందని గుర్తించారు. ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటికే 10 గంటల పాటు గాల్లో ప్రయాణించిన విమానాన్ని తిరిగి షికాగోకు మళ్లించారు.
- ఎయిరిండియా ప్రకటన
ఈ ఘటనపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ, మార్చి 6న షికాగో-దిల్లీ ఎయిర్ ఇండియా-126 విమానం సాంకేతిక కారణాల వల్ల తిరిగి షికాగోకు పంపినట్లు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గమ్యస్థానానికి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామని, ఎవరైనా ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే పూర్తి రీఫండ్ అందించనున్నట్లు తెలిపారు. అలాగే, రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా కల్పించినట్లు వెల్లడించారు.