ట్రెండింగ్.. ఢిల్లీలో స్వచ్ఛమైన గాలికి 18% జీఎస్టీ!
దేశ రాజధాని ఢిల్లీని కొన్నేళ్లుగా వెంటాడుతున్న వాయు కాలుష్యం ఈ ఏడాది కూడా కోరలు చాస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీని కొన్నేళ్లుగా వెంటాడుతున్న వాయు కాలుష్యం ఈ ఏడాది కూడా కోరలు చాస్తోంది. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 422గా సుచిస్తోంది. ఫలితంగా.. కొన్ని రోజులుగా దేశ రాజధాని ప్రాంత వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రోడ్లపైకి వస్తే ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు.. విమానాలకు అంతరాయం కలుగుతోంది.. రైళ్ల రాకపోకలకు సవాళ్లు ఎదురవుతున్నాయి.. స్కూల్స్ మూసేయాల్సి వచ్చింది.. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సాధారణ జన జీవనం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఈ సమయంలో ఓ ఇంట్రస్టింగ్ చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ఢిల్లీలో వాయు కాలుష్యం, పొగ మంచు కారణంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో... ఢిల్లీ రాజధాన్నిగా ఇంకా కొనసాగాలా అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక ప్రశ్న లేవనెత్తారు. ఈ నేపథ్యంలో... ఎక్స్ లో ఓ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో అతడు కన్నడ నేర్చుకోమంటున్నాడు!
ఈ పోస్ట్ లో స్వచ్ఛమైన గాలి ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ... "స్వచ్ఛమైన గాలి ప్రాథమిక హక్కు.. అయితే, ఢిల్లీలో మీరు స్వచ్ఛమైన గాలికి కూడా 18% జీఎస్టీ చెల్లించాలి. ఇది కన్నడ నేర్చుకోవడానికి.. ఏక్యూఐ 60-80 ఉన్న బెంగళూరులో శాస్వతంగా స్థిరపడటానికి సమయం" అని రాసుకొస్తూ... ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతను తెలిపే ఒక ఫోటోను జతచేశాడు.
ఢిల్లీ ప్రజలు తీవ్ర కాలుష్యంతో సతమతమవుతున్న తరుణంలో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సందర్భంగా... ఢిల్లీలో ఇప్పుడు గాలి పీలిస్తే... ఒక్క రోజులో 40+ సిగరెట్లు కాల్చడంతో సమానం అని అంటున్నారు! ముఖ్యంగా పిలలు, వృద్ధులు, శాస్వకోశ, గుండె జబ్బులు ఉన్నవారికి తీవ్ర ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని చెబుతున్నారు.
వాస్తవానికి గత కొన్నేళ్లుగా ఢిల్లీ ఎదుర్కొంటున్న సమస్యలు గతంలో పలు కీలక నగరాలకూ వచ్చాయి. అయితే... అక్కడున్న నాయకుల చిత్తశుద్ధో, ప్రజల పట్టుదలో కానీ.. తర్వాత కాలంలో ఆ నగరాల్లో అద్భుతమైన నగరాలుగా మారాయి. ఉదాహరణకు 19వ శతాబ్ధం ఆఖర్లో లండన్ కు కూడా ఇప్పుడు ఢిల్లీకి ఉన్న సమస్యే ఉండేది.
అయితే... బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల స్థానంలో గ్యాస్ ప్రాజెక్టులను నిర్మించడం.. క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో నగరంలో చర్యలు చేపట్టడం చేసింది. ఫలితంగా... 2021 నాటికి ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల్లో ఒకటిగా నిలిచింది లండన్!