జడేజాకు పీసీబీ ఛైర్మన్ పదవి ఆఫర్... ఇంట్రస్టింగ్ రియాక్షన్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు దారుణమైన ప్రదర్శన అనంతరం.. ఆటగాళ్ల తొలగింపుతో పాటు బోర్డులోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ లో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రధానంగా కొట్లాడి మరీ తెచ్చుకున్నట్లుగా సంపాదించుకున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ ట్రోఫీ నుంచి ఇప్పటికే ఆతిథ్య జట్టు నిష్క్రమించడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులతోపాటు మాజీలు మండిపడుతున్నారు. ఈ సమయంలో టీమిండియా మాజీ స్టార్ కు ఆ దేశ మాజీలు ఓ పదవి ఆఫర్ చేశారు.
అవును... ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు దారుణమైన ప్రదర్శన అనంతరం.. ఆటగాళ్ల తొలగింపుతో పాటు బోర్డులోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ టోర్నీలో పాక్ ఒక్క విజయం కూడా సాధించకుండానే నిష్క్రమించడాన్ని ఫ్యాన్స్ తో పాటి మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రూప్ - బీలో ఆ జట్టు -1.087 నెట్ రన్ రేట్ తో ఒక్క పాయింట్ మాత్రమే కలిగి ఉంది.
ఈ నేపథ్యంలోనే జట్టు సభ్యులతో పాటు సెలక్షన్ కమిటీ, కోచింగ్ సిబ్బందిలోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో ఓ అభిమాని.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవికి విదేశీ వ్యక్తిని తీసుకోవడానికి బోర్డు సిద్ధంగా ఉంటుందో లేదో తనకు అనుమానంగా ఉంది అని అన్నారు! దీంతో డీపీ వరల్డ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఆసక్తికర దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అవి వైరల్ గా మారుతున్నాయి!
ఈ సందర్భంగా స్పందించిన వసీం అక్రమ్... ఒక విదేశీ వ్యక్తి పీసీబీ ఛైర్మన్ పాత్రను ఎందుకు చేపట్టే అవకాశం లేదు అని అంటూ విషయాన్ని మరింత చర్చకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన వకార్ యూనిస్... ఆ స్థానం కోసం అజయ్ జడేజా పేరును ప్రతిపాదించాడు! దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికరంగా స్పందించారు.
ఇందులో భాగంగా... "వసీం అక్రమ్ కి పిల్లలు ఉన్నారు.. నాకు కూడా ఉన్నారు" అని జడేజా నవ్వుతూ అన్నాడు. ఇదే సమయంలో.. ఈ ఉద్యోగానికి రెండు అంశాలు కీలకంగా ఉన్నాయని.. అందులో ఒకటి అడ్మినిస్ట్రేషన్, రెండోది క్రీడా అంశం అని.. వాటిని వేరు చేయవచ్చని తెలిపారు. బోర్డు ఎంత లాభం చేకూర్చింది అనే దానిపై అభిమానులకు ఆసక్తి ఉండదని పేర్కొన్నారు.
బోర్డు లాభాలపై సగటు క్రికెట్ అభిమానికి, ప్రజలకు ఆసక్తి ఉండదని.. తమ దేశ క్రికెట్ ఏ ఆటగాళ్లతో ఎలా అభివృద్ధి చెందుతుందో అనేది మాత్రం చూడాలని ఫ్యాన్స్ భావిస్తుంటారని అన్నారు. అయితే... గతంలో ఓసారి పీసీబీ ఛైర్మన్ పదవిపై స్పందించిన అక్రమ్.. ఆ పాత్ర తాను పోషించలేనని, తన కుటుంబానికి దగ్గరగా ఉండాలని తాను భావిస్తున్నానని అన్నారు!
కాగా... ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఒక్క విజయం కూడా సాధించకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... పాక్ పై తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో విజయం సాధించగా.. తర్వాత మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. బంగ్లాతో మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది.