అర్ధరాత్రి 2 గంటల వరకూ.. తండ్రి ముఖేష్ గురించి ఆకాశ్ చెప్పిన ఆసక్తికర విషయం

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ తన తండ్రి, ముఖేశ్ అంబానీ నుంచి ఎంతగానో ప్రేరణ పొందుతున్నానని వెల్లడించారు.;

Update: 2025-03-01 21:30 GMT

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ తన తండ్రి, ముఖేశ్ అంబానీ నుంచి ఎంతగానో ప్రేరణ పొందుతున్నానని వెల్లడించారు. ముంబయి టెక్ వీక్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, తన తండ్రి ఇప్పటికీ ప్రతీ మెయిల్‌కు స్వయంగా సమాధానం ఇస్తారని, ఇందుకోసం అర్ధరాత్రి రెండు గంటల వరకు మేల్కొని ఉంటారని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా రిలయన్స్ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ముఖేశ్ అంబానీ కృషి తనకు ఎంతో స్ఫూర్తినిస్తోందని తెలిపారు.

ఆకాశ్ అంబానీ తన తల్లి, నీతా అంబానీ గురించి మాట్లాడుతూ ఆమె క్రికెట్‌ అంటే ఎంతో ఆసక్తి కనబరుస్తారని, మ్యాచ్‌లను చూస్తూ చిన్నచిన్న విషయాలను గమనించి ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. తన తల్లిదండ్రులిద్దరిలోనూ ఉన్న అంకితభావం, పని పట్ల నిబద్ధత తనకు గొప్ప స్ఫూర్తిగా మారిందని చెప్పారు. కుటుంబమే తనకు పని-వ్యక్తిగత జీవితానికి సమతుల్యత ఎలా ఉండాలో నేర్పిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాధాన్యాలను తెలుసుకోవడం ఎంతో అవసరమని, ఉద్యోగులు ఎంతసేపు పని చేస్తున్నారనే కన్నా వారి పనితనం, నాణ్యతే ముఖ్యం అని వ్యాఖ్యానించారు.

తన కవల అక్క ఈశాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కుటుంబ విలువలకు ఇద్దరూ ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారితో గడిపేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటానని తెలిపారు. భార్య శ్లోక అంబానీ తనను బాగా అర్థం చేసుకుంటుందని, ఆమె తన జీవితంలో భాగమవడం తన అదృష్టమని అన్నారు. గత ఏడాది అంబానీ ఇంట్లో వరుస వేడుకలు జరగడంతో, వ్యాపార కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ఇచ్చి కుటుంబంతో సమయం గడిపిన విషయాన్ని గుర్తు చేశారు.

టెక్ వీక్ ఈవెంట్‌లో కృత్రిమ మేధ (AI) అభివృద్ధికి కంపెనీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇందుకోసం 1000 మంది డేటా సైంటిస్ట్‌లు, పరిశోధకులు, ఇంజినీర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశంలోని ఏఐ ప్రయాణంలో భాగమయ్యేందుకు జామ్‌నగర్‌లో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని తెలిపారు. గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల (GPU) సరఫరాకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని, త్వరలో క్లౌడ్ పర్సనల్ కంప్యూటర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. రాబోయే త్రైమాసికాల్లో ‘జియో బ్రెయిన్’ పేరిట ఏఐ సూట్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

ఆకాశ్ అంబానీ చేసిన వ్యాఖ్యలు, టెక్నాలజీ పట్ల ఆయన చూపిస్తున్న ఆసక్తి దేశంలో డిజిటల్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తోడ్పడనున్నాయి.

Tags:    

Similar News