7సార్లు గెలిచిన హరీశ్ కాకుండా 6 సార్లు గెలిచిన అక్బరుద్దీన్ ఎలా?

ఏడుసార్లు గెలిచిన హరీశ్ ను కాదని.. ఆరుసార్లు గెలిచిన అక్బరుద్దీన్ ను ఎలా ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి

Update: 2023-12-09 03:57 GMT

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువు తీరనున్న మూడో అసెంబ్లీకి సంబంధించి ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.సాధారణంగా ఎన్నికలు ముగిసి.. కొత్తగా అసెంబ్లీ కొలువు తీరే రోజున.. సభకు ఎన్నికైన వారిలో అత్యంత సీనియర్ ను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేసి.. వారి చేత సభలోని సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ సంప్రదాయాన్ని చూసినప్పుడు సభలో అత్యంత సీనియర్ గా గత అసెంబ్లీలో స్పీకర్ గా వ్యవహరించిన పోచారం శ్రీనివారెడ్డినే అవుతారు.

అయితే.. గత సభలో స్పీకర్ గా వ్యవహరించిన ఆయన్ను తాజా సభలో ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించమని కోరితే.. ఆయన స్థాయిని తగ్గించినట్లు అవుతుంది. అందుకే.. ఆయనకు బదులుగా సభలో అత్యధికసార్లు (ఏడుసార్లు) గెలిచిన హరీశ్ నుఎంపిక చేయాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నంగా ఆరు సార్లు గెలిచిన మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేయటం ఆసక్తికరంగా మారింది.

ఏడుసార్లు గెలిచిన హరీశ్ ను కాదని.. ఆరుసార్లు గెలిచిన అక్బరుద్దీన్ ను ఎలా ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. అంతేకాదు.. ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్.. దానం నాగేందర్ లు కూడా ఆరుసార్లు గెలిచిన వారే. అయినప్పటికీ.. ప్రోటెం స్పీకర్ గా వారికి అవకాశం దక్కలేదు. అయితే.. ప్రోటెం స్పీకర్ గా శనివారం ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం అసెంబ్లీకి ఆయన ప్రోటెం స్పీకర్ హోదాలో ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయిస్తారు.

రాష్ట్రంలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయరు. శుక్రవారం రాత్రి ఆయనకు సర్జరీ జరిగిన కారణంగా.. ఆయన ప్రమాణం చేసే అవకాశం లేదంటున్నారు. ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేసేటప్పటికి మధ్యాహ్నం వరకు పడుతుందని.. ఆ తర్వాత శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. బీఏసీలో సభను ఎన్ని రోజులు నడపాలన్న దానిపై చర్చ జరుగుతంది. అయితే.. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేసిన రోజే.. మంత్రివర్గసమావేశం జరగటం.. తొలి అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు సాగుతాయని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేయటం తెలిసిందే. అయితే.. ఎన్ని రోజులు సాగుతాయన్నది తాజా బీఏసీలోనూ చర్చించనున్నారు.

ఈ రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తుండటంతో.. తెలంగాణ రెండో అసెంబ్లీ రద్దైయింది. 2018 డిసెంబరులో ఏర్పాటైన రెండో శాసనసభను రద్దు చేస్తున్నట్లుగా గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ప్రకటన విడుదల చేశారు.ఈ మేరకు శుక్రవారం గెజిట్ విడుదలైంది. అందులో మంత్రివర్గ సలహా మేరకు అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లుగా పేర్కొనటం గమనార్హం.

Tags:    

Similar News