గెలుపు బాటలో ఆలపాటి.. వైసీపీని నమ్మి మునిగిన కేఎస్!
ఈ నియోజకవర్గంలో కూటమి తరఫున మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేశారు.;
కూటమిని నమ్మి రంగంలోకి దిగిన వారు ఒకరు.. వైసీపీ నమ్ముకుని పోరుబాట పట్టిన వారు మరొకరు. ఇప్పుడు ఫలితం చూస్తే.. కూటమికే అనుకూలంగా ఉండడంతో వైసీపీని నమ్ముకుని రంగంలోకి దిగిన నాయకుడు.. ఈసురోమంటున్నాడు. ఇదీ.. తాజాగా ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తెరమీదకు వచ్చిన అంశం. రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఒకటి ఉమ్మడి కృష్నా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గంలో కూటమి తరఫున మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేశారు. తాజాగా ఆయన ఫామ్‌లో ఉన్నారు. బలమైన ఓట్లతో దూసుకుపోతున్నారు.
ఇక, పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానంలో పోటీ ఉన్న మరో బలమైన నాయకుడు కేఎస్ లక్ష్మణరావు. ఈయన వైసీపీ అండతో రంగంలోకి దిగారు. కానీ, ఈయన పరిస్ధితి డోలాయమానంలో పడిపోయింది. వాస్తవానికి వైసీపీ అండగా ఉండకపోతేనే.. ఆయనకు మేలు జరిగి ఉండేదేమో.. అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ స్థానంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియంలో 28 టేబుళ్ళ లో మొదటి రౌండులో 28,312 ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి చెల్లుబాటు అయిన ఓట్లు 25242గా తేలగా.. చెల్లని ఓట్లు 3070గా తేల్చారు.
వీరిలో కూటమి తరఫున పోటీలో ఉన్న అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 17,194 ఓట్లు కైవసం చేసుకున్నారు. ఇక, వైసీపీ మద్దతుతో రంగంలోకి దిగిన పిడిఎఫ్ అభ్యర్థి కే ఎస్ లక్ష్మణరావు 7214 ఓట్లతో చాలా వెనుక బడ్డారు. ప్రధాన అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కేఎస్ లక్ష్మణ రావు మధ్య 9980 ఓట్ల వ్యత్యాసం ఉండడంతో ఆలపాటి విజయం నల్లేరుపై నడకే అన్నట్టుగా పరిస్థితి మారింది. అంతేకాదు.. వైసీపీ మద్దతు కారణంగానే లక్ష్మణరావు వెనుకబడ్డారా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుండడం గమనార్హం. కాగా.. తుది ఫలితం వెల్లడించేందుకు సమయం ఉంది.