‘జగన్’ పేరు పలికి ఎంత పని చేశావ్ అలపాటి
పరిస్థితులు మామూలుగా ఉంటే పెద్ద సమస్య కాదు. విషయం సున్నితంగా ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
పరిస్థితులు మామూలుగా ఉంటే పెద్ద సమస్య కాదు. విషయం సున్నితంగా ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ విషయంలో తెనాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ నోటి నుంచి వచ్చిన మాట.. ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది. మాజీ ఎమ్మెల్యేగా.. సీనియర్ నేతగా సుపరిచితులైన ఆలపాటి రాజా.. తాజాగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో మాట్లాడే క్రమంలో.. తీవ్రమైన ఆవేశంతో మాట్లాడిన ఆయన.. చివర్లో చంద్రబాబు పేరుకు బదులుగా జగన్ పేరును పలకటం ఇబ్బందికరంగా మారింది. తెలుగు తమ్ముళ్లకు షాకిచ్చేలా మాట్లాడిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాటకు తలలు పట్టుకుంటున్న పరిస్థితి.
వైసీపీ సర్కారు మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. చివర్లో నోరు జారి నవ్వులపాలైన ఆయన పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని తపిస్తున్నారు ఆలపాటి. అయితే.. ఆ స్థానం నుంచి జనసేన నెంబరు2లో ఉన్న నాదెండ్ల మనోహర్ టికెట్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివేళ.. జనసేనకు టికెట్ కేటాయిస్తే.. తాము సహకరించేది లేదని టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఇలాంటివేళ.. ఈ పీటముడిని ఎలా విప్పదీయాలన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి.
వాస్తవ కోణంలో చూస్తే.. తెనాలిలో నాదెండ్ల మనోహర్ తో పోలిస్తే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కే పట్టు ఎక్కువ. గడిచిన ఐదేళ్ల కాలంలో పార్టీకి కమిట్ మెంట్ తో ఉంటూ.. నిత్యం పోరాటం చేయటం తెలిసిందే. ఐదేళ్లుగా పోరాటం చేస్తూ.. ఆలపాటికి తప్పించి మరెవరికీ టికెట్ ఇవ్వలేని పరిస్థితిని ఆయన తెచ్చుకున్నారు. పార్టీకి సంబంధించి విధేయత ప్రదర్శించే నేతల్లో ఒకరిగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఆందోళనలకు పార్టీ పిలుపునిచ్చినా వెనక్కి తగ్గకుండా.. ఒత్తిళ్లను ఎదుర్కొని పోరాడిన ఆలపాటికి అనూహ్యంగా నాదెండ్ల మనోహర్ రూపంలో సవాలు వచ్చింది.
ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలోనూ తెనాలి సీటును టీడీపీకే కేటాయించాలని.. మిత్రధర్మం పేరుతో జనసేనకు ఇస్తే ఒప్పుకునేదే లేదంటూ ఒక కార్యకర్త పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునే వరకు వెళ్లటం తెలిసిందే. ఇలాంటి వేళ.. తెనాలి టికెట్ పంచాయితీ టీడీపీ - జనసేన మధ్య దూరాన్ని పెంచే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళలో.. తాజాగా జరిగిన టీడీపీ బహిరంగ సభలో ఆలపాటి నోరు జారిన వైనం తెలుగు తమ్ముళ్లకు ఇబ్బందికరంగా మారింది. ఆయన నోరు జారి చంద్రబాబు పేరుకు బదులుగా సీఎం జగన్ పేరును ప్రస్తావించిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారటం ఇబ్బందికరంగా మారింది.