ఆస్పత్రి పాలైన అలేఖ్య చిట్టి.. మమ్మల్ని వదిలేయండి అంటూ వేడుకోలు
పచ్చళ్ల వ్యాపారంతో గుర్తింపు పొందిన అలేఖ్య చిట్టి చివరకు అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో ఆస్పత్రి పాలైంది.;

పచ్చళ్ల వ్యాపారంతో గుర్తింపు పొందిన అలేఖ్య చిట్టి చివరకు అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో ఆస్పత్రి పాలైంది. ఓ కస్టమర్ ను కించపరిచేలా ఆమె తిట్టడం.. ఆ ఆడియో వైరల్ కావడంతో ఈమె నెటిజన్లకు టార్గెట్ అయ్యింది. సెలబ్రెటీలు తప్పుపట్టారు. దీనితో ఆమెపై గత కొద్ది రోజులుగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అలేఖ్య చిట్టి డిప్రెషన్‌కు గురై ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
పచ్చళ్ల వ్యాపారంతో పాటు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న అలేఖ్య చిట్టికి ఇటీవల ఒక కస్టమర్‌తో ధరల విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అలేఖ్య చిట్టి అసభ్య పదజాలంతో దూషించడంతో ఆ ఆడియో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గతంలో ఆమె చేసిన వీడియోలు, ఆడియోలను కూడా వెలికితీసి ట్రోల్ చేశారు. ఈ దెబ్బతో ఆమె వ్యాపారం కూడా మూతపడే పరిస్థితికి చేరుకుంది.
ట్రోలింగ్ తీవ్రం కావడంతో అలేఖ్య చిట్టి క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేసింది. కన్నీటితో తన తప్పును ఒప్పుకున్నప్పటికీ ట్రోలింగ్ ఆగలేదు. దీంతో ఆమె మానసిక ఒత్తిడికి గురై నీరసించిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో కృత్రిమ ఆక్సిజన్ అందిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయంపై అలేఖ్య చిట్టి అక్క సుమి ఒక వీడియో విడుదల చేశారు. తన చెల్లి చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పినప్పటికీ ట్రోలింగ్ ఆగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలేఖ్య బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోతోందని, ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ తండ్రి చనిపోయి కేవలం మూడు నెలలే అయిందని, ఇప్పుడు మరో బాధను తట్టుకునే శక్తి తమకు లేదని ఆమె వేడుకున్నారు. పచ్చళ్ల వ్యాపారం, యూట్యూబ్ తమకు వద్దని, తమ చెల్లి క్షేమంగా ఉంటే చాలని సుమి ఆవేదనగా తెలిపారు.
ఇక అలేఖ్య చెల్లెలు కూడా ఆవేదనతో మరో వీడియో విడుదల చేసింది. ‘మా అక్క చావు బతుకుల్లో ఉంది. తనకేమైనా అయితే మీరే బాధ్యులు అంటూ ఒక వీడియోను విడుదల చేసింది. మేం చేసిన తప్పుకు మా వ్యాపారాలు దెబ్బతిన్నాయని.. రోడ్డుమీదకు లాగేశారని.. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేసి బతకనివ్వండి అంటూ చెల్లెలు బాధతో ఆక్సిజన్ సిలిండర్ల ముందు వీడియో విడుదల చేసింది.
అలేఖ్య చిట్టి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ఆపాలని అభిప్రాయపడుతున్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకు ఈ స్థాయిలో శిక్షించడం సరికాదని, ఆమె క్షమాపణ చెప్పిన తర్వాత కూడా వేధించడం మానవత్వం కాదని అంటున్నారు.
మొత్తానికి, అలేఖ్య చిట్టి ఒక చిన్న వివాదంతో మొదలైన ట్రోలింగ్ కారణంగా ఆస్పత్రి పాలవడం బాధాకరమైన విషయం. ఈ ఘటన సోషల్ మీడియాలో హద్దులు మీరిన ట్రోలింగ్‌పై మరోసారి చర్చకు దారితీసింది. తప్పు చేసిన వారు క్షమాపణ కోరిన తర్వాత కూడా వారిని వేధించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.