'ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్'... గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు!
తాజాగా వెలుగులోకి వచ్చింది ఇలాంటి ఘటన! ఈసారి మరింత వైరల్ గా!!
చాలా సార్లు విన్న విషయమే.. రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్న సంఘటనే.. మోసపోయే వాళ్ళు మోసపోతుంటే.. పోలీసులు అడ్డుకట్టకు ప్రయత్నిస్తుంటే.. మోసగాళ్లు చేసేవాళ్లు సరికొత్త మార్గాల్లో దూసుకుపోతున్నారు.. మరింత వ్యూహాత్మకంగా మోసాలు చేస్తున్నారు! తాజాగా వెలుగులోకి వచ్చింది ఇలాంటి ఘటన! ఈసారి మరింత వైరల్ గా!!
అవును... ఒకప్పుడు రకరకాల ఆఫర్లతో, అత్యధిక లాభాలు ఆశ చుపించి.. అమాయకులను, అత్యాశపరులను వలలో వేసుకుని, నిండా ముంచిన సైబర్ నేరగాళ్లు.. ఆ తర్వాత హనీట్రాప్ తరహాలో ముందుకు వెళ్లారు. తర్వాత.. పోలీసులు, సీఐడీ, సీబీఐ అధికారుల తరహాలో మాట్లాడుతూ బెదిరించి మరీ సైబర్ నేరానికి పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే తాజాగా... సంతానం లేని స్త్రీలను గర్భవతులను చేస్తే భారీ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఓ ముఠా ప్రకటనలు గుప్పించింది. ఈ సమయంలో ఆసక్తి కలిగిన యువకుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ తర్వాత అసలు విషయం గ్రహించిన బాధితులు లబో దిబో మంటున్నారు.
ఈ తరహా మోసాలపై పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందడం మొదలైంది. దీంతో... దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు ముథా సభ్యులను అరెస్ట్ చేశారు. బీహార్ లోని నవడా జిల్లాలో జరిగిన ఈ స్కామ్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... "ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్" పేరిట ఫేస్ బుక్ లో ఈ ముఠా సభ్యులు ప్రకటనలు ఇచ్చారు. ఈ సందర్భంగా... పిల్లలు లేని స్త్రీలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు పొందవచ్చని ప్రకటించారు. ఒకవేళ వారు విఫలమైతే రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు సైతం పొందే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం.
ఈ తరహా ప్రకటన చూసేసరికి ఉత్సాహం తెచ్చుకున్న కొంతమంది యువకులు.. ఆ ముఠాను సంప్రదించారు. ఈ క్రమంలో ముందుగా బాధితుల నుంచి ముఠాసభ్యులు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్ఫీ ఇతర వివరాలు సేకరించారు. అనంతరం రిజిస్ట్రేషన్ ఫీజు అని, హోటల్ రూమ్ బుక్కింగ్ ఫీజ్ అని డబ్బులు వసూలు చేశారు.
ఈ సమయంలో... అలా చెల్లించడానికి ఎవరైనా ఆసక్తి చూపించని పక్షంలో బ్లాక్ మెయిల్ కూడా చేసేవారు. దీంతో... ఈ వ్యవహారంపై పలువురు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.