గవర్నర్‌తో చంద్రబాబు-చంద్రబాబుతో అమిత్‌షా భేటీలే భేటీలు!
అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు.. ఎంత మందిని ఆహ్వానించారు.. అనే వివరాలను కూడా వెల్లడించారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న సమయంలో వడివడిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన భేటీ ప్రాదాన్యం సంతరించుకుంది. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంగణం వివరాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు.. ఎంత మందిని ఆహ్వానించారు.. అనే వివరాలను కూడా వెల్లడించారు.
ఇక, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో తొలిరోజు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాలను కూడా చంద్రబాబు గవర్నర్ నజీర్‌కు ఇచ్చారు. ఆయా అభ్యర్థుల సీనియార్టీ, బయోడేటా, అర్హతలు, సామాజిక వర్గాల వారీగా ఒక నివేదికను ముం దుగానే గవర్నర్ కు వివరించారు. ఇది సంప్రదాయం ప్రకారం జరిగేదే. అయితే.. గత జగన్ ప్రభుత్వం మాత్రం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. దీంతో ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేస్తున్నదీ గవర్నర్కు ముందుగానే చెప్పలేదు. దీంతో అప్పటి గవర్నర్ నరిసంహన్ తడబడ్డారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు సంప్రదాయాలకు పెద్ద పీట వేశారు.
ఇదిలావుంటే.. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి 9.30 గంటలకు విజయవాడ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే ఆయన నేరుగా చంద్రబాబు నివాసానికి వస్తారు. ఆయనతో దాదాపు గంట పాటు భేటీ కానున్నారు. బీజేపీ తరఫున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారితోనూ ఆయన భేటీకానున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వనరులు.. ఇతరత్రా అంశాలపై ఈ బేటీలోనే చంద్రబాబు అమిత్ షాకు వివరించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.