తీసుకునే నాధుడు లేక బ్యాంకుల్లో మూలుగుతున్న 78 వేల కోట్లు !
బ్యాంకులలో నోట్ల కట్టలు చూసిన వారికి అవన్నీ తమ పరమైతేనో అన్న చిలిపి కోరిక తట్టకుండా ఉండదు.
బ్యాంకులను చూస్తే ముచ్చట వేస్తుంది. అక్కడ కరెన్సీ ప్రవహిస్తుంది. అది నీదా నాదా అని రాసిపెట్టి ఉండదు. దానికి ఏ రంగూ ఉండదు. ఎవరి ఖాతాలోకి జమ అయితే అది వారి హక్కు భుక్తం అవుతుంది. బ్యాంకులలో నోట్ల కట్టలు చూసిన వారికి అవన్నీ తమ పరమైతేనో అన్న చిలిపి కోరిక తట్టకుండా ఉండదు.
బ్యాంకులు అంటే పది మంది సొత్తు. దాచుకునేది ఒకరు, అప్పులు తీసుకునేది ఒకరు. ఎగ్గొట్టేది ఒకరు, డబ్బులు ఉంచినా వెనక్కి తీసుకోని వారు కూడా మరో జాబితా ఉంది. ఇపుడు అలాంటి జాబితా గురించే చర్చించుకోవాల్సి ఉంది.
మన దేశంలోని బ్యాంకులలో పేరుకుపోయిన క్లెయిం చేయని డిపాజిట్లు ఏకంగా 78 వేల కోట్ల రూపాయలు అని ఆర్ధిక గణాంకాలు లెక్క తేల్చాయి. ఇది చాలా పెద్ద మొత్తం. అన్ని బ్యాంకులలో కలిపి ఇంత పెద్ద ఎత్తున నగదు అలా బ్యాకు సొరుగుల్లో పడి మూలుగుతోంది.
ఇలా ఎందుకు మూలుగుతోంది అంటే డిపాజిట్లు చేసిన వారు మరణిస్తారు. వారు నామినీలుగా పేరు పెట్టిన వారు వచ్చి ఆ నగదు మాదే అని క్లెయిం చేసుకోవడం లేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఏ ఏటికి ఆ ఏడు ఈ విధంగా నగదు నిల్వలు అలా పేరుకుని పోతున్నాయట.
ఈ డబ్బు బ్యాంకులు ఏమీ చేయలేనివి. వాటిని ఏ ఖాతాకూ మళ్ళించలేనివి. దాంతో ఇది అతి పెద్ద సమస్యగా బ్యాంకులకు మారింది అని అంటున్నారు. దీంతో ఈ సమస్య ఇపుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దేశవ్యాప్తంగా బ్యాంకులలోఇలా క్లెయిం చేయని డిపాజిట్ల సమస్యలకు తగిన పరిష్కారం చూపించే దిశగా కేంద్రం అడుగులు వేయబోతోంది.
దాన్ కోసం బ్యాంకింగ్ చట్టాలలోనూ సవరణలు తేబోతోంది అని అంటున్నారు. ప్రస్తుతం బ్యాంకులలో చూస్తే సేవింగ్ ఖాతాలు కానీ ఫిక్సెడ్ ఖాతాలు కానీ ఒక నామినీనే అనుమతిస్తున్నారు. వారు కనుక ఆ డిపాజిట్ దారుడు మరణించిన సందర్భంలో సొమ్ముని క్లెయిం చేసుకోకపోతే అది అలాగే మూలుగుతూ ఉంటుంది.
అలా కాకుండా నలుగురు నామినీలను కనుక ఈ ప్లేస్ లో అనుమతితే వారిలో ఎవరో ఒకరు ఆ డిపాజిట్లను క్లెయిం చేసుకుంటారు అని కేంద్రం ఆలోచిస్తోందిట.దీని వల్ల కేవలం బ్యాంకులకు మాత్రమే కాకుండా బాండ్లు, డివిడెండ్ల సమస్యకు కూడా తగిన పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. దీంతో పాటు అనేక రకాలైన బ్యాంకింగ్ సంస్కరణలను కూడా ముందుకు తీసుకుని రాబోతున్నారు అని అంటున్నారు. ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు తొందరలోనే వస్తుందని అంటున్నారు.