పెట్టీ కేసులు.. కూటమికి రాజకీయ కాక..!
తాజాగా మాజీ మంత్రి, పలాస మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు పెట్టారు. ఆయనతో పాటు.. మరో 19 మందిపైనా కేసులు నమోదుచేశారు.;

ఏపీలో కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా కాక పెరుగుతోంది. వైసీపీ నాయకులపై కేసుల పెట్టాలని.. గతంలో తమను తీవ్ర ఇబ్బందుల పాల్జేశారని.. పేర్కొంటూ కూటమి పార్టీల నాయకుల నుంచి వస్తున్న వత్తిడులతో ప్రభుత్వం ఏదో ఒక రకంగా కేసులు పెట్టేస్తోంది. అయితే.. ఇవి పిట్టీ కేసులు(అంటే ఫైన్ వేసి వదిలేసే కేసులు) కావడంతోపాటు.. కూటమి తమపై కక్ష కడుతోందన్న ఆరోపణలు చేసేందుకు వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతోందని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా మాజీ మంత్రి, పలాస మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు పెట్టారు. ఆయనతో పాటు.. మరో 19 మందిపైనా కేసులు నమోదుచేశారు. అయితే.. ఈ కేసులు పెద్దగాబలం ఉన్నవి కాకపోవడం గమనార్హం. కేవలం కేసులు పెట్టామని పోలీసులు సంఖ్యాపరంగా చెప్పుకొనేందుకు అవకాశం ఉన్నవే. ఢిల్లీరావు అనే సామాజిక కార్యకర్త మృతి చెందారు. అయితే.. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ.. విచారణను వేగంగా పూర్తి చేయాలని సీదిరి డిమాండ్‌చేశారు.
ఈ క్రమంలోనే పలాసపోలీసు స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ట్రాఫిక్‌కు అడ్డు తగులుతున్నారంటూ.. సీదిరి సహా 19 మందిపై కేసు పెట్టారు. కానీ, వైసీపీ మాజీ మంత్రిపై కేసు పెట్టామని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే.. ఇది పిట్టీ కేసు. మహా అయితే.. రూ.500 ఫైన్ వేసి వదిలేసే కేసు. ఇక, దువ్వాడ శ్రీనివాస్.. విద్యుత్ శాఖ అధికారిని ఫోన్‌లో దూషించారని మరో కేసు పెట్టినట్టు తెలిసింది. కానీ, ఇదికూడా.. నిలబడేదికాదు.. మహా అయితే.. రూ.100 ఫైన్ వేసే కేసు.
అదేసమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పైనా.. కేసు పెట్టారు. అలాగే మాజీ మంత్రి ఉష శ్రీచరణ్‌పైనా పోలీసులు కేసు పెట్టారు. పోలీసులను దూషించారన్నది ఈ కేసు. అయితే.. ఇది కూడా నిలిచేదికాదు. ఎందుకంటే.. సరైన ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిఉంటుంది. ఇలాంటి కేసులు నిలబడవు. కానీ.. పేరుకు మాత్రం కేసులు పెడుతున్నామని పోలీసులు.. కూటమి సర్కారు తమను వేధిస్తోందని చెప్పుకొనేందుకు వైసీపీకి ఒక ఛాన్స్ ఇవ్వడం తప్ప.. వీటిలో ప్రత్యేకత అంటూ ఏమీ లేదని అంటున్నారు పరిశీలకులు.