రెండో విడత నామినేటెడ్ మూట విప్పుతున్నది అపుడే ?
మొత్తానికి చూస్తే ఈ ఏడాది చివరి లోగా మొత్తం వంద కార్పోరేషన్లకు నియామకాలు చేపట్టడం ద్వారా క్యాడర్ లో జోష్ నింపాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయింది. పదవుల కోసం ద్వితీయ శ్రేణి నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలకు చెందిన వారు అంతా పదవులు తమకు దక్కుతాయని బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు.
అయితే నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం పదవులు పందేరం చేయాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. చంద్రబాబు కూటమిలోని జనసేన బీజేపీల విషయంలో ఆయా పార్టీల అధినాయకత్వానికి ఎంపిక చేసే బాధ్యతను ఒదిలేస్తున్నారు.
కానీ టీడీపీ విషయంలో మాత్రం ఆయన చాలా సమీకరణలు చూస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ అదే చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారి వివరాలు అన్నీ అధినాయకత్వం పరిశీలిస్తుందని ఆ మీదట అన్నీ చూసుకుని పదవులు పంపిణీ చేస్తుందని ఇది ఒక ప్రాసెస్ అని అన్నారు.
పదవుల పంపిణీలో నిజమైన నేతలకు న్యాయం చేసి తీరుతామని కూడా లోకేష్ చెప్పారు. దాంతో ఇపుడు చంద్రబాబు గట్టిగానే వడపోత పోస్తున్నారు. రెండవ విడతలో ఎవరెవరికి పదవులు లభిస్తాయన్నది చూడాల్సి ఉంది. తొలి విడతలో ఇరవై కార్పోరేషన్ల చైర్మన్ పదవులు, పాలక వర్గాలను ఎంపిక చేశారు. ఇందులో పదిహేడు పదవులు టీడీపీ తీసుకుంటే రెండు జనసేనకు, ఒకటి బీజేపీకి ఇచ్చారు.
ఇక ఇపుడు మరో ఇరవై కార్పోరేషన్ల పదవులు భర్తీ చేస్తారా లేక ఆ సంఖ్య ముప్పయికి చేరుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. అయితే ఎక్కువ మందికి పదవులు కావాలని ఉంది. దాంతో వంద దాకా ఏపీలో ఉన్న కార్పోరేషన్ చైర్మన్ పదవుల్లో కనీసం సగం అయినా రెండవ విడతలో భర్తీ చేయాలని కూటమిలోని ఆశావహులు కోరుతున్నారు.
ఈసారి ముప్పయి కార్పోరేషన్లు భర్తీ చేస్తే టీడీపీకి పాతిక దాకా దాకుతాయి. జనసేనకు మూడు బీజేపీకి రెండు దక్కే వీలు ఉంటుందని లెక్కలేస్తున్నారు. తొలివిడత భర్తీలో గోదావరి విశాఖ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి శ్రీకాకుళంతో పాటు గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు.
ఏది ఏమైనా మరో రెండు మూడు రోజులలో రెండవ విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుందని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. దాంతో అంతా కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. ఈ నెల 16న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఉంది. అది పూర్తి కాగానే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రకటన ఉండొచ్చు అని అంటున్నారు. అంటే దసరా తరువాత టీడీపీ కూటమి పార్టీలోని ఆశావహులకు ఇస్తున్న అతి పెద్ద గిఫ్ట్ గా దీనిని భావిస్తున్నారు
ఇదిలా ఉంటే ఈసారి తమకు మరిన్ని పదవులు కావాలని బీజేపీ కూడా గట్టిగా కోరవచ్చు అని అంటున్నారు. బీజేపీలో కీలక నేతలు కూడా ఇపుడు పదవుల విషయంలో చూస్తున్నారు. వారిని కూడా న్యాయం చేయాలని అంటున్నారు. అయితే బీజేపీ హై కమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో టీడీపీ అధినాయకత్వానికి ఏ రకమైన సిఫార్సులు చేస్తుందో చూడాల్సి ఉంది.
మొత్తానికి చూస్తే ఈ ఏడాది చివరి లోగా మొత్తం వంద కార్పోరేషన్లకు నియామకాలు చేపట్టడం ద్వారా క్యాడర్ లో జోష్ నింపాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఎవరికి ఈ పదవులు దక్కుతాయో, ఎవరు ఆ అదృష్టవంతులో.