ఏపీ సీన్ వేరప్పా.. జిల్లా కేంద్రాల్లో ఖాళీల్లేవ్!
కొన్ని నెలలుగా వేచి చూసిన క్షణాలు వచ్చేస్తున్న వేళ.. ఏపీవ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు కొత్త సీన్ కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో హైలెట్ గా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యావత్ దేశం చూపు ఏపీ మీద ఉంది. గడిచిన కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ ఎన్నికల ప్రక్రియతో పాటు.. తుది ఫలితం మీదా ఆసక్తి వ్యక్తమవుతోంది.
కొన్ని నెలలుగా వేచి చూసిన క్షణాలు వచ్చేస్తున్న వేళ.. ఏపీవ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు కొత్త సీన్ కనిపిస్తోంది. ఎక్కడైతే ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందో.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని హోటళ్లు.. లాడ్జిలు ఫుల్ అయిపోయిన పరిస్థితి. హోటళ్లలోని రూంల్నిపొలిటికల్ పార్టీల నేతలు పోటాపోటీగా బుక్ చేసేశారు. హోటళ్లలో రూంల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
దీంతో.. ఇప్పుడు బంధువులు.. తెలిసిన వారి ఇళ్లకు వెళుతున్న పరిస్థితి. దీంతో.. ఏపీ వ్యాప్తంగా ఇప్పుడో సిత్రమైన సీన్ ఆవిష్క్రతమవుతోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లోని పట్టణాలు మొత్తం జిల్లాలోని వివిద పార్టీల నేతలు.. వారి అనుచర గణంతో కళకళలాడుతోంది. జిల్లా వ్యాప్తంగా వచ్చే వారి వాహనాలతో రోడ్లు రద్దీగా ఉంటున్నాయి.
ఓట్ల లెక్కింపును గతానికి భిన్నంగా అధికార.. విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం.. ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. దీంతో.. అవసరానికి మించిన అనుచర గణాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజున నెలకొనే అన్ని పరిస్థితులకు సిద్ధమయ్యేలా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. దీంతో.. రోటీన్ గా అవసరమయ్యేదానికి రెట్టింపు బలాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. వీరందరి బసకు భారీ ఎత్తున డిమాండ్ నెలకొంది. అయితే.. ఏపీ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని పెద్ద హోటళ్ల నుంచి చిన్న లాడ్జిల వరకు ఫుల్ అయిపోయిన పరిస్థితి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈసారి నెల ముందే బుకింగ్ లు అయిపోయినట్లుగా కొన్ని జిల్లా కేంద్రాలకు చెందిన హోటల్ యజమానులు చెబుతున్నారు.