కేసీఆర్ ను సొంతగడ్డలో దెబ్బ కొట్టనున్న రేవంత్.. రేపే ముహూర్తం?

నవంబరు 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు వచ్చిన జిల్లా ఉమ్మడి మెదక్.

Update: 2024-07-14 11:38 GMT

ఇప్పటివరకు ఎక్కడెక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనో కాంగ్రెస్ లో చేర్చుకుంటూ వస్తోన్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సొంతగడ్డపైనే దెబ్బకొట్టనుందా...? ఇప్పటికే ఒక ఎమ్మెల్యేను దాదాపు ఆకర్షించిన రేవంత్ రెడ్డి సర్కారు మరో ముగ్గురు గులాబీ ఎమ్మెల్యేలనూ కలిపేసుకోనుందా..? దీనికి సోమవారమే ముహూర్తమా..? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలు వస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్ కు పెద్ద దెబ్బేనని స్పష్టం అవుతోంది.

మెతుకు సీమలో

నవంబరు 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు వచ్చిన జిల్లా ఉమ్మడి మెదక్. జహీరాబాద్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, పటాన్ చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కారు పార్టీదే గెలుపు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా.. ఉమ్మడి మెదక్ లో ఆ పార్టీకి మూడు (మెదక్, అందోలు, నారాయణఖేడ్) సీట్లే దక్కాయి. ఇక ఇందులో గజ్వేల్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేసి నెగ్గారు. సిద్దిపేట ఎలాగూ బీఆర్ఎస్ అడ్డానే. అక్కడ మాజీ మంత్రి హరీశ్ రావు విజయదుందుభి మోగించారు. దుబ్బాకలో కేసీఆర్ సన్నిహితుడు ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్, నర్సాపూర్ లో మాజీ మంత్రి సునీతారెడ్డి, పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి నెగ్గారు. అయితే, వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆయన కలిశారు.. మరి వీరు?

సీఎం రేవంత్ రెడ్డిని శనివారం పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కలిశారు. అయితే, పటాన్ చెరు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేళ్లుగా ఆయనను ఢీకొంటున్న పలువురు నాయకులు మహిపాల్ చేరికను అంగీకరించడం లేదు. దీంతోనే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక ఆగిపోయిందని తెలుస్తోంది. కాగా, ఉమ్మడి మెదక్ కు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారన్న ఊహాగానాలు వస్తున్నాయి. వీరిలో ఒకరు మాజీ మంత్రి కావడం గమనార్హం. అయితే, ఈ ఎమ్మెల్యేలు అందరూ గతంలో ఓసారి సీఎం రేవంత్ ను కలిశారు. డెవలప్ మెంట్ కార్యక్రమాల కోసమే వెళ్లినట్లు అప్పట్లో చెప్పారు. తర్వాత ఎలాంటి కదలిక లేదు.

కేసీఆర్ కు శరాఘాతమే..

తన సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ నుంచి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అది పెద్ద దెబ్బనే. ఇప్పటివరకు మహబూబ్ నగర్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. మెదక్ నుంచి మాత్రం ఎవరూ వెళ్లలేదు. ఇప్పుడే ఒకేసారి నలుగురు జంప్ చేస్తే అది పెద్ద సంచలనమే. కేసీఆర్, బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బనే.

Tags:    

Similar News