పుతిన్ జిన్ మోదీ.. ఈ నేతల్లో పదవి కామన్ పాయింట్..
వీటిలో బ్రెజిల్ కూడా విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం కావడం గమనార్హం
ప్రపంచంలో అతి పెద్ద దేశాలు రష్యా, చైనా, భారత్. వైశాల్య పరంగా చూస్తూ ఈ మూడు దేశాలు 3 కోట్ల చదరపు మైళ్లపైనే ఉంటాయి. అంటే దాదాపు సగం ప్రపంచం అంత అనుకోవచ్చు. ఇక భారత్, చైనా జనాభానే 300 కోట్లకు పైగా ఉంటుంది. రష్యాలో 25 కోట్లనూ కలుపుకొంటే 330 కోట్లకు దగ్గర అనుకోవచ్చు. మరోవైపు ఈ మూడు దేశాలు బలమైన బ్రిక్స్ (భారత్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్) కూటమి సభ్యులు. వీటిలో బ్రెజిల్ కూడా విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం కావడం గమనార్హం. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లను ఓ విషయంలో పోల్చక తప్పడం లేదు.
జీవిత కాల పదవి లక్ష్యం
పుతిన్ 2000 సంవత్సరం నుంచి రష్యాను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. మధ్యలో రాజ్యాంగం నిబంధన ప్రకారం ఆ పదవి నుంచి తప్పుకొని ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, రాజ్యాంగాన్ని సవరించి మళ్లీ అధ్యక్షుడు అయ్యారు. ఇటీవల మరోసారి ఆరేళ్ల కాలానికి గాను పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2030 వరకు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. 24 ఏళ్లుగా రష్యా అధినేతగా ఉన్న ఆయన.. ఆధునిక రష్యాను అత్యధిక కాలం పాలించిన స్టాలిన్ రికార్డును తిరగరాయనున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే సమయంలో జర్మనీలో సోవియట్ గూఢచారిగా ఉన్న పుతిన్, దేశాధ్యక్షుడిగా ఎదగడమే కాకుండా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన వ్యక్తిగా నిలవనున్నారు.
1999లో ఎల్సిన్ అధ్యక్షుడిగా తప్పుకొన్నాక తాత్కాలికంగా పుతిన్ నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అధికారికంగా అధ్యక్షుడయ్యారు. రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు మాత్రమే ఈ పదవిని చేపట్టాల్సి ఉంటుంది. కానీ, దానిని సవరించి మరో రెండుసార్లు అధ్యక్షుడయ్యారు పుతిన్. ఇటీవలితో కలిపి ఐదోసారి పదవి చేపట్టారు. 2030 వరకు కొనసాగినా.. ఆ తర్వాత కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పుతిన్ అర్హుడు కావడం గమనార్హం.
ఉక్కుపిడికిలి జిన్ పింగ్
కమ్యూనిస్టు చైనాపై తన ఉక్కు పిడికిలి బిగించారు జిన్ పింగ్. నిరుడు మార్చిలో ఆయన చైనా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికై చరిత్ర సృష్టించారు. వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. అత్యంత బలమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా కూడా జిన్ పింగ్ ఎన్నికయ్యారు. నిరుడు మార్చి 10న జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో 2,952 ఓట్లు ఏకగ్రీవంగా జిన్ పింగ్ కు పోలయ్యాయి. అంతముందుకు ఏడాది చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20వ జాతీయ మహాసభల్లో స్టాండింగ్ కమిటీ జిన్ పింగ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తిమంతుడైన నాయకుడిగా 71 ఏళ్ల జిన్ పింగ్ నిలిచారు. ఇక చైనాకు ఆయనే జీవిత కాల అధ్యక్షుడు కావడం గమనార్హం.
మన మోదీ మూడోసారి..
భారత ప్రధానిగా పదేళ్లుగా అప్రతిహత అధికారం చెలాయించిన మోదీ మరోసారి కూడా తానే ప్రధాని అంటున్నారు. బీజేపీ 370 సీట్లుపైగా సాధిస్తుందని, 400 సీట్లతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి బీజేపీలో 75 ఏళ్లు దాటిన నాయకులకు రిటైర్మెంట్ ఇచ్చే సంప్రదాయం ఉంది. దీనిని మోదీ పక్కకు తోసేశారు. 74 ఏళ్ల మోదీ వచ్చే ఏడాది సెప్టెంబరు 24తో 75 పూర్తి చేసుకుంటారు. అయినా పూర్తికాలం మూడోసారి పదవిలో కొనసాగే ఉద్దేశంలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా గురువారం ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరింత చర్చను రేపాయి. దీనిప్రకారం మోదీ మరో 23 ఏళ్లు క్రియాశీలంగా ఉంటానని చెబుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి వికసిత భారత్ తన లక్ష్యంగా పేర్కొనే మోదీ అప్పటివరకు తాను కష్టపడతానని చెప్పారు. దేవుడు తనను ప్రత్యేక కార్యక్రమం మీద పంపాడని.. 2047 వరకు టైమిస్తాడని కూడా వ్యాఖ్యానించారు. మరో రెండు దశాబ్దాలు రాజకీయాల్లో కొనసాగుతానని అర్థం వచ్చేలా మాట్లాడారు.
పుతిన్, మోదీ, జిన్ పింగ్ ముగ్గురూ 70 ఏళ్లు దాటినవారే. ముగ్గురూ ఇప్పట్లో పదవుల నుంచి రిటైరయ్యే ఉద్దేశంలో లేరనేది తాజా పరిణామాల ఆధారంగా స్పష్టం అవుతోంది.