ఫ్రెండ్ ఇంటికి వెళ్లడం కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదు.. హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

నంద్యాల రెండో పట్టణ ఠాణా పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2024-10-22 07:15 GMT

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టును ఆశ్ర‌యించ‌డం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో అల్లు అర్జున్ అనుమతి లేకుండా నంద్యాల‌కు వెళ్లి కోడ్ ను ఉల్లంఘించారంటూ ఈ ఏడాది మే 11న కేసు నమోదు చేసారు. అయితే ఈ కేసుని కొట్టేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది తన వ్యక్తిగత పర్యటన అని, స్నేహితుడి ఇంటికి వెళ్లడం కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదు అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై అప్ప‌ట్లో చాలా ఫిర్యాదులు వచ్చాయి. అల్లు అర్జున్‌ నంద్యాల వచ్చేందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని, ఆయన్ను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడారని.. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం కిందికే వస్తుందని డిప్యూటీ తహసీల్దార్‌ రామచంద్రరావు మే 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్, రవిచంద్ర కిశోర్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ త‌ర్వాత శిల్పా రవి ఓటమి చెందడమే కాదు, కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చింది.

నంద్యాల రెండో పట్టణ ఠాణా పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. స్నేహితుడి ఇంటికి వెళ్లడం తన వ్యక్తిగత పర్యటన అని, శిల్పా రవి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున అభినందించేందుకు మాత్రమే వెళ్లానని అర్జున్‌ తెలిపారు. బహిరంగ సభ నిర్వహించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత సందర్శన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదని, తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోర్టును కోరారు.

ఇందులో నంద్యాల రెండో పట్టణ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్, 2024 ఎన్నికల ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ టీమ్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ పి.రామచంద్రరావు లను ప్రతివాదులుగా చేర్చారు. అల్లు అర్జున్ పిటిషన్ ను హైకోర్ట్ విచారణకు స్వీకరించింది. కాకపోతే ఈ పిటిషన్ సోమవారం జాబితాలో ఉన్నప్పటికీ.. కోర్టు సమయం ముగియటంతో విచారణకు నోచుకోలేదు. దీంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. మరి ఈ కేసులో విచార‌ణ‌లో ఏం తేలుతుందో, న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇకపోతే, ఏపీ ఎన్నిక‌ల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా నంద్యాల‌కు వెళ్ల‌డంపై జ‌న‌సేన కార్యకర్తలు, మెగా అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం సీజేశారు. బన్నీని టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో విపరీతంగా నెగెటివ్ పోస్టులు పెట్టారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ చేసి, డిలీట్ చేయడం దీనికి మరింత ఆజ్యం పోసింది. అప్పటి నుంచి తరచుగా నెట్టింట ఇరు వర్గాల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Tags:    

Similar News