వర్చువల్ గా నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్... కారణం ఇదే!
ఆన్ లైన్ ద్వారా హాజరవుతారని ఆయన తరుపు న్యాయవాదులు కోర్టును కోరడంతో.. అందుకు న్యాయమూర్తి అనుమతించారని అంటున్నారు.
'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు దాదాపు మూడు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అంటున్నారు.
జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 13న అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు అదే రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో.. అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
అయితే... ఈ లోపు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో డిసెంబర్ 14న ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ 24న అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు మరోసారి విచారించారు. ఆ సంగతి అలా ఉంటే.. ఈ రోజు మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు అల్లు అర్జున్.
అవును... అల్లు అర్జున్ ఈ రోజు నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరవుతున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరవుతున్నారు.
వాస్తవానికి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో నేరుగా హాజరవ్వాల్సి ఉండగా.. ఆన్ లైన్ ద్వారా హాజరవుతారని ఆయన తరుపు న్యాయవాదులు కోర్టును కోరడంతో.. అందుకు న్యాయమూర్తి అనుమతించారని అంటున్నారు. దీంతో... అల్లు అర్జున్ వర్చువల్ గానే హాజరవుతున్నారు.
మరోవైపు.. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. దీనిపై కోర్టు విచారణ జరపనుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలపనున్నారని అంటున్నారు.