అల్లు అర్జున్ – పవన్ కల్యాణ్ మీటింగ్ జరుగుద్దా?

అయితే... అల్లు అర్జున్ ఇంటికి పవన్ వెళ్లే అవకాశాల సంగతి కాసేపు పక్కనపెడితే.. వీరిద్దరి భేటీ ఈ రోజు జరిగే అవకాశాలున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.

Update: 2024-12-17 06:58 GMT

"పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో అరెస్టైన అల్లు అర్జున్.. ఒక రాత్రి చంచల్ గూడ జైల్లో ఉండి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు మరింతగా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ఇక అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ లో మెగా ఫ్యామిలీ వ్యవహారం అత్యంత హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. మెగా వర్సెస్ అల్లు అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుందని అంటున్న వేళ.. అల్లు అర్జున్ అరెస్టు అనంతరం ఆయన నివాసానికి సతీసమేతంగా వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. వీరితో పాటు నాగబాబూ ఉన్నారు.

పైగా... హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ కు సంబంధించిన లాయర్ నిరంజన్ రెడ్డిని చింరజీవే ఏర్పాటు చేశారనే చర్చా జరిగింది. ఇక జైలు నుంచి విడుదలై నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ను మేనత్త కొణిదెల సురేఖ వచ్చి కలిశారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఇళ్లకు వెళ్లారు.

కష్టకాలంలో తనకు కొండంత అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి నివాసానికి సతీసమేతంగా వెళ్లిన అల్లు అర్జున్.. అక్కడే లంచ్ చేసి, చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పారని అంటున్నారు. ఇదే సమయంలో తర్వాత పరిణామాలపైనా చర్చించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పిక్స్, దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

మరోపక్క.. పెద మావయ్య చిరంజీవిని కలిసిన అనంతరం అల్లు అర్జున్ దంపతులు.. మెగా బ్రదర్ నాగబాబు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా స్వాగతించారు నాగబాబు. ఈ సందర్భంగా కేసు వ్యవహారాలపై నాగబాబుతో అల్లు అర్జున్ సుదీర్ఘంగా చర్చించారని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... ఈ ఘటన అనంతరం అత్యంత ఆసక్తికర భేటీగా చర్చ జరుగుతున్నట్లు చెబుతున్న అల్లు అర్జున్ - పవన్ కల్యాణ్ ల భేటీపై ఇప్పుడు తీవ్ర ఆసక్తి నెలకొందని అంటున్నారు. అయితే... అల్లు అర్జున్ ఇంటికి పవన్ వెళ్లే అవకాశాల సంగతి కాసేపు పక్కనపెడితే.. వీరిద్దరి భేటీ ఈ రోజు జరిగే అవకాశాలున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ రోజు మంగళగిరి ఎయిమ్స్ లో ఓ కార్యక్రమం కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానశ్రయంలో ఆమెకు స్వాగతం పలికిన అనంతరం పవన్ కల్యాణ్ హైదరబాద్ పయనం కాబోతున్నారని అంటున్నారు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ ని కలిసే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా... అల్లు అర్జున్ అరెస్ట్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఖండించగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి పరామర్శించారు. ఇదే సమయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా నేడు బన్నీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే ఆన్ లైన్ వేదికగా జరిగే చాలా చర్చలకు క్లారిటీ వచ్చినట్లే అని అంటున్నారు మెగా ఫ్యాన్స్!

Tags:    

Similar News