బిగ్ బ్రేకింగ్... అల్లు అర్జున్ కు పోలీసుల నోటీసులు!
"పుష్ప-2" సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన వ్యవహారం ఎంత సంచలనంగా మారిందనే సంగతి తెలిసిందే
"పుష్ప-2" సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన వ్యవహారం ఎంత సంచలనంగా మారిందనే సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగ్గా.. అనంతరం మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నారు.
దీంతో... మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కమ్యునిస్టు నేతలు, ఓయూ జేఏసీ నాయకులు వరుసగా అల్లు అర్జున్ వ్యవహార శైలితో పాటు.. అలాంటి సినిమాలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వడంపైనా విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో ఐకాన్ స్టార్ అయినా, సూపర్ స్టార్ అయినా చట్టం ముందు సమానమే అనే కామెంట్లు వినిపించాయి.
మరోపక్క మీడియా ముందు హైదరాబాద్ సీపీ వీడియో ప్రదర్శించగా.. అసలు ఆ రోజు ఏమి జరిగిందనే విషయాన్ని ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్ లు సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు. దీంతో... అల్లు అర్జున్ వ్యవహార శైలిపై పోలీసులు సీరియస్ గా ఉన్నారనే చర్చ తెరపైకి వచ్చింది! ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అవును... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు (24 డిసెంబర్ - మంగళవారం) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.