మూడు గంటల్లో మొత్తం అయిపోయింది... ఫ్యాన్స్ గోల!
కట్ చేస్తే... టీవీల్లో బిగ్ బ్రేకింగ్ విత్ లౌడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్... "అల్లు అర్జున్ కి రిమాండ్... అల్లు అర్జున్ కి రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్" అని వరుసగా బ్రేకింగ్ లు కనిపించాయి.
దాదాపు ఏ ఒక్కరూ ఊహించని విషయం.. ఫ్యాన్స్ అయితే ఏమాత్రం తేరుకోలేని సమయం.. అటు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు యావత్ భారతదేశంలోని సినిమా ఇండస్ట్రీ, సినీ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యే సందర్భం.. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్ స్థాయిలో పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ చంచల్ గూడ జైలులో ఉండబోతున్నారు.
అవును... "పుష్ప-2" సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు థియేటర్లలో సందడి చేస్తుండటంతో బన్నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటోన్న సమయంలో.. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం చిక్కడపల్లి స్టేషన్ కు తరలించారు. ఈ విషయం వైరల్ గా మారింది.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ని సెంట్రల్ జోన్ ను డీసీపీ ఆధ్వర్యంలో విచారించారు. ఇదే సమయంలో బన్నీ నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలిస్తారంటూ టీవీల్లో కనిపించిన బ్రేకింగ్స్.. ఫ్యాన్స్ హార్ట్స్ ని బ్రేక్ చేశాయని అంటున్నారు. ఇలా సీన్ గాంధీ ఆస్పత్రికి మారింది.
మరోపక్క.. అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు, నాగబాబు చేరుకున్నారు. ఇంకోపక్క అల్లు అరవింద్ తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు. మీడియా మొత్తం నాంపల్లి కోర్టు పరిశరాల వద్దే ఉంది! మరోపక్క.. రాజకీయ నాయకుల స్టేట్ మెంట్స్ మొదలయ్యాయి.
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ బీఆరెస్స్ నేతలు ఆరోపించడం మొదలుపెట్టారని అంటున్నారు. మరోపక్క ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు లు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. మరోపక్క బీజేపీ నేతలు బండి సంజయ్, రాజాసింగ్ లు ప్రభుత్వాన్ని తప్పుబట్టారు!
అటు వైసీపీ నేత అంబటి రాంబాబు.. ‘అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం!’ అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నరంటూ లక్ష్మీ పార్వతి ఫైరయ్యారు. పుష్కరాల్లో 29 మంది మరణానికి కారణమైనప్పుడు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కేఏ పాల్ ప్రశ్నించారు.
అదే సమయంలో... విషయం వేరైనప్పటికీ సందర్భానికి తగ్గట్లుగా అని అనిపించేలా "విభేదాలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం.." అంటూ పొందుపరిచిన వాక్యాన్ని "కలిసుంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం.." అనే సబ్జెక్ట్ తో కలిపి పవన్ కల్యాణ్ ట్వీట్ ప్రత్యక్షమైంది! దీంతో.. ఆన్ లైన్ వేదికగా నెటిజన్ల విశ్లేషణలు పీక్స్ కి చేరాయి.
ఈ సమయంలో... సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో భార్యను కోల్పోయిన భాస్కర్ స్పందించారు. ఆయన ఫిర్యాదు మేరకే అరెస్టులు జరుగుతున్నాయని అంటున్న వేళ... “అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం లేదు.. ఆస్పత్రిలో ఉన్న నేను అరెస్ట్ వార్త చూశాను.. కేసు విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను” అని స్పందించారు.
కట్ చేస్తే... మళ్లీ సీన్ గాంధీ ఆస్పత్రి నుంచి నాంపల్లి కోర్టుకు మారింది. అక్కడ విపరీతమైన సందడి వాతావరణం నెలకొంది. ఎటు చూసినా జర్నలిస్టులు, ఖాకీ దుస్తులు, నల్ల కోట్లు దర్శనమిస్తున్న పరిస్థితి. ఈ సమయంలో కోర్టులో వాదనలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ వైపు, అటు పోలీసుల వైపు పీపీ వాదనలు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు.
కట్ చేస్తే... టీవీల్లో బిగ్ బ్రేకింగ్ విత్ లౌడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్... "అల్లు అర్జున్ కి రిమాండ్... అల్లు అర్జున్ కి రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్" అని వరుసగా బ్రేకింగ్ లు కనిపించాయి. దీంతో... అభిమానుల గుండెలు ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయని అంటున్నారు.
‘పుష్ప-2’ సినిమాకు ఉన్నంత డ్యూరేషన్ లోనే అంత జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లినప్పుడు ఎవరైనా వ్యక్తి ఏదైనా థియేటర్ లో ‘పుష్ప-2’ సినిమా చూడటానికి వెళ్తే... సినిమా పూర్తై ఇంటికి వచ్చే సరికి టీవీలో "చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్" అనే వార్త దర్శనమిచ్చిందని చెప్పినా అతిశయోక్తి కాదు!