అక్బరుద్ధీన్ స్టార్ట్, రేవంత్ ఫైర్, కోమటిరెడ్డి కంటిన్యూ... అంతా స్క్రిప్టా?
తెలంగాణ అసెంబ్లీలో శనివారం అక్బరుద్ధీన్ లేవనెత్తడం, రేవంత్ రెడ్డి విరుచుకుపడటం, కోమటిరెడ్డి కొనసాగించడానికి ముందు, తర్వాత అన్నట్లుగా మారిపోయిందని చెప్పినా అతిశయోక్తి కాదేమో!
సంధ్య థియేటర్ లో ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన నేపథ్యంలో.., దానిపై చర్చ... తెలంగాణ అసెంబ్లీలో శనివారం అక్బరుద్ధీన్ లేవనెత్తడం, రేవంత్ రెడ్డి విరుచుకుపడటం, కోమటిరెడ్డి కొనసాగించడానికి ముందు, తర్వాత అన్నట్లుగా మారిపోయిందని చెప్పినా అతిశయోక్తి కాదేమో!
అల్లు అర్జున్ అరెస్టు, విడుదల అనంతరం ఇక వ్యవహారం అంతా చల్లబడినట్లే.. కోర్టు పరిధిలోకి వెళ్లిపోయింది కాబట్టి ఇకపై బయట చర్చలు ఉండనట్లే అనే చర్చలు నడిచాయని అంటున్న వేళ ఒక్కసారిగా తెలంగాణ అసెంబ్లీలో మంటలు రేగాయని అంటున్నారు. అయితే.. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం అన్నట్లుగా స్పందించారు బండి సంజయ్.
అవును... సంధ్య థియేటర్ ఘటన తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో... ఈ వ్యవహారంపై స్పందించేవాళ్లు కూడా పార్టీల వారీగా విడిపోయి స్పందిస్తున్నారనే చర్చ మొదలైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. సంధ థియేటర్ ఘటనలో మహిళ మృతిని అందరూ ఖండించారని.. అదేవిధంగా.. శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా... మృతురాలి కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారని.. ఈ సమస్య ముగిశాక అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించారని.. సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్యను పునఃప్రారంభించినట్లు చేసారంటూ బండి సంజయ్ ఆరోపించారు! దీంతో... ఈ ఆరోపణలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి.
అలా ఒక ప్లాన్ ప్రకారం అసెంబ్లీ వేదికగా సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని.. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ అన్నారు. ఎంఐఎం ని నమ్మితే గతంలో బీఆరెస్స్ కు పట్టిన గతే కాంగ్రెస్ కూ పడుతుందంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ జోస్యం చెప్పారు.
ఇక... గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారం తిని చనిపోతున్నా.. వారి కుటుంబాలను రేవంత్ రెడ్డి ఏనాడైనా పరామర్శించారా..? ఆ మరణాలకు బాధ్యత వహించారా..? అని నిలదీసిన సంజ... మీకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా..? అని ప్రశ్నిస్తూ.. రేవంత్ ఇకనైనా కక్ష సాధింపు చర్యలు వీడాలని అన్నారు.
ఇలా శనివారం తెలంగాణ అసెంబ్లీ జరిగిందంతా స్క్రిప్ట్ ప్రకారం అంటూ బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.