నందిగం ఎఫెక్ట్: మా సంగతి చూడాలంటున్న రాజధాని రైతులు
బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను మంగళగిరి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను మంగళగిరి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2022లో టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో తన అనుచరులను రెచ్చగొట్టి దాడి చేయించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. దీంతో పాటు మాస్టర్ ప్లాన్‌లోనూ ఆయన భాగస్వామ్యం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కూడా లబించకపోవడంతో నందిగం సురేష్ ను మంగళగిరి పోలీసులు గురువారం తెల్లవారుజామునే అరెస్టు చేశారు.
ప్రస్తుతం ఆయనను గుంటూరు జైలుకు పంపించారు. ఇదిలావుంటే.. ఇప్పుడు రాజధాని రైతులు కూడా నందిగం సురేష్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తాము గతంలో ఆయనపై అనేక ఫిర్యాదులు చేశామని.. అయినా పట్టించుకోలేదని.. అప్పట్లో వైసీపీప్రభుత్వం ఆయనను కాపాడిందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు గతంలో తాము పెట్టిన ఫిర్యాదులను తిరగదోడి కేసులు పెట్టాలని వారు కోరుతు న్నారు. ఈ మేరకు.. పోతుల బాలకోటయ్య.. సహా పలువురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతులు పోలీసులను కలిసి విన్నవించారు.
గతంలో రాజధాని కోసం తాము ఉద్యమించిన సమయంలో ఎంపీగా ఉన్న సురేష్ తమను అవహేళనగా మాట్లాడారని వారు పేర్కొన్నారు. పెయిడ్ ఆర్టిస్టులని.. అమ్ముడు పోయారని.. చంద్రబాబుకు తొత్తులని ఇలా లేనిపోని వ్యాఖ్యలతో మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. ఒక రైతుకు ఉద్యమం చేస్తున్న సమయంలో గుండె పోటు వస్తే.. కనీసం 108 వాహనం వస్తున్నా.. దానిని కూడా అడ్డుకునేలా వ్యవహరించారని రైతులు ఆరోపించారు. వీటిపై అప్పట్లోనే తాము ఫిర్యాదులు చేశామన్నారు.
దీనికి తోడు మూడు రాజధానుల ఉద్యమం పేరిట సమాంతరంగా శిబిరాలు ఏర్పాటు చేయించిన అప్పటి ఎంపీ నందిగం సురేష్... తమపై వ్యతిరేకంగా ప్రచారం చేశారని.. కొన్ని కొన్ని సందర్భాల్లో దాడులు కూడా చేయించారని ఈ నేపథ్యంలో ఆయా ఫిర్యాదులపై ఇప్పటికైనా కేసులు పెట్టి తమకు ఉపశమనం కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న నందిగంను బయటకు రాకుండా అడ్డుకోవాలని కూడా వారు కోరుతున్నారు. అయితే.. దీనికి ఉన్న తాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.