హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణం.. ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా!
ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి పలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే మరో అద్భుత నిర్మాణం జరపోబోతంది.
హైదరాబాద్ మహానగరం ఇప్పటికే విశ్వవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. అదే స్థాయిలో ఐటీ సంస్థలు, టెక్నాలజీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. నిత్యం ఇక్కడ జనాభా పెరుగుతూనే ఉంది. పల్లెలు, పట్టణాల నుంచి ఇక్కడికి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. దీంతో ఇక్కడి ట్రాఫిక్ సమస్యల గురించి ఇక చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి పలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే మరో అద్భుత నిర్మాణం జరపోబోతంది. నగరంలోని జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద ఉన్న కేబీఆర్ పార్క్ నుంచి 6.3 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు నిర్ణయించింది. పర్యాటకులను ఆకట్టుకోవడమే కాకుండా.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించబోతోంది. కేబీఆర్ పార్క్ కింది నుంచి సొరంగం మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. టన్నెల్ నిర్మాణంపై సాధాసాధ్యాలపైనా అధ్యయనం పూర్తికాగా.. దానికి సంబంధించి పనులు చకచకా జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు సులువుగా రాకపోకలు సాగేందుకు.. పర్యాటకులను ఆకర్శించేందుకు దుర్గం చెరువు కేబుల్ వంతెనకు కొనసాగింపుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే దేశంలోనే రెండో అతిపెద్ద సొరంగ మార్గం కానుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం వరకు 1.70 కిలోమీటర్లు, కేబీఆర్ ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి ఎన్ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు 2 కిలోమీటర్లు, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 టన్నెల్ జాయింట్ పాయింట్ 1.10కిలోమీటర్లు, అప్రోచ్ రోడ్లు 1.50 కి.మీ కలిపి మొత్తం 6.30 కి.మీ ఈ సొరంగ మార్గం నిర్మించనున్నారు.
అలాగే.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజ అగ్రసేన్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45, చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు కూడళ్లలో రూ.1,200 కోట్లతో ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఆరు అండర్ పాస్‌లను నిర్మించనున్నారు. బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు చేయనున్న రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం రూ.150 కోట్లు చేయనున్నారు. రోడ్డు పొడవు 6.5 కిలోమీటర్లు కాగా.. 306 నిర్మాణాలను కూల్చివేసేందుకు నిర్ణయించారు. వీటిలో 86 నివాసాలకు మార్కింగ్ చేశారు.