మన పెళ్లిళ్ల ఖర్చు ఎంతో తెలిస్తే…!

భారత్‌లోని అత్యంత ఖరీదైన వివాహ వేడుకల్లో ఒకటిగా నిలిచింది.

Update: 2024-06-26 04:07 GMT

ముకేశ్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ - ఆనంద్ పిరమల్ వివాహం కోసం రూ. 700 కోట్లకుపైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. భారత్‌లోని అత్యంత ఖరీదైన వివాహ వేడుకల్లో ఒకటిగా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చెంట్ ల మొదటి ప్రీ వెడ్డింగ్ కు రూ.1260 కోట్లు, రెండో ప్రీ వెడ్డింగ్ కు రూ.7500 కోట్లు ఖర్చు చేయగా, జులై 12న ముంబయిలో జరగబోయే వివాహానికి రూ.1000 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

భారతీయ సమాజంలో వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, పేద, ధనిక తేడా లేకుండా అప్పు చేసైనా, ఆస్తులు అమ్మయినా ఖర్చుకు మాత్రం వెనకాడడం లేదని జెఫెరీస్‌ అనే ఒక క్యాపిటల్‌ మార్కెట్‌ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పిల్లల చదువుకన్నా వివాహాల మీద రెండింతలు ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఏడాదికి సగటున భారతదేశంలో రూ.10.7 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, సగటున ఒక వివాహానికి రూ.12.5 లక్షలు ఖర్చవుతున్నట్లు తేలింది.

ఇది దంపతులపై డిగ్రీ వరకు చదువుపై చేసే ఖర్చు కంటే రెండింతలు అని నివేదిక పేర్కొన్నది. భారతీయులు సగటున వివాహానికి వెచ్చిస్తున్న మొత్తం మన దేశ తలసరి జీడీపీ రూ.2.4 లక్షల కంటే ఐదు రెట్లు ఎక్కువ ఉండడం విశేషం. దేశంలో సగటున ఒక కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షల కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ఆభరణాల్లో వివాహ ఆభరణాల వాటా 50 శాతం, మొత్తం వస్త్రాల అమ్మకాల్లో వివాహ వస్త్రాల వాటా 10 శాతం ఉంటుందని అధ్యయనంలో వెల్లడయింది.

Tags:    

Similar News