అంబానీల పెళ్లి: ఒకటోసారి 1000 కోట్లు.. రెండోసారి 500కోట్లు!
దీనికోసం ముఖేష్ అంబానీ కుటుంబం ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేయడం ఒక సంచలనం.
భారత కుబేరుడు ముఖేష్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ CEO విరేన్ మర్చంట్ - ఎన్‌కోర్ హెల్త్‌కేర్ డైరెక్టర్ షాలియా మర్చంట్ దంపతుల కుమార్తె రాధిక మర్చంట్ ను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. జూలైలో ఈ వివాహం జరగనుంది. దానికి ముందు వారు మార్చి 1 నుండి మార్చి 3 వరకు జామ్‌నగర్‌లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు బాలీవుడ్ హాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీస్ నుంచి రాజకీయ, పారిశ్రామిక రంగాల నుంచి ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. దీనికోసం ముఖేష్ అంబానీ కుటుంబం ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేయడం ఒక సంచలనం.
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జంట కోసం అంబానీ కుటుంబం రెండవ ప్రీ-వెడ్డింగ్ వేడుకను నిర్వహించనుందనేది తాజా వార్త. ఇది విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో జరిగే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ అని తెలిసింది. షిప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది? అతిథులు ఎవరెవరు? అనే వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ రెండవ ప్రీ-వెడ్డింగ్ వేడుక మే 28 నుండి మే 30 వరకు జరుగుతుంది. మూడు రోజుల్లో 4380 కిలోమీటర్ల దూరం ప్రయాణించే లగ్జరీ క్రూయిజ్‌లో అంబానీ కుటుంబం సుమారు 800 మంది అతిథులకు ఆతిథ్యం ఇస్తుంది. ఇటలీ నుండి దక్షిణ ఫ్రాన్స్‌కు ఈ క్రూయిజ్ షిప్ బయలుదేరనుంది. అతిథుల జాబితాలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్ తదితరులు ఉండవచ్చు అని కథనాలొస్తున్నాయి. 800 మంది అతిథులతో పాటు 600 మంది ఆతిథ్య సిబ్బంది కూడా ఈ ప్రీవెడ్డింగ్ యాత్రలో జాయినవుతారు.
మరోవైపు వెడ్డింగ్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పెళ్లి వేడుకలు మే 29 న ప్రారంభిస్తారని జూన్ 1 వరకు ఈ వేడుకలు కొనసాగుతాయని తెలిసింది. మే 29 న సిసిలీ, ఇటలీ , స్విట్జర్లాండ్ నుండి అతిథులు క్రూయిజ్‌లోకి ప్రవేశిస్తారని కూడా తెలుస్తోంది. ఈసారి ఫ్యూచరిస్టిక్ క్రూయిజ్ థీమ్ ని అంబానీ కుటుంబం అనుసరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 300 మంది వివిఐపి అతిథులు గ్రాండ్ క్రూయిజ్ పార్టీ కోసం ఆహ్వానాలు అందుకున్నారని కూడా కథనాలొస్తున్నాయి. ఈ రెండో ప్రీవెడ్డింగ్ కోసం ఏకంగా 500 కోట్లు వరకూ ఖర్చు చేసే వీలుందని ఒక అంచనా. అటుపై ముచ్చటగా మూడోసారి ఈవెంట్ అయిన `పెళ్లి వేడుక` కోసం మళ్లీ 1000 కోట్లు సునాయాసంగా ఖర్చవుతాయని కూడా విశ్లేషిస్తున్నారు.
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అనంత-రాధిక జంట ప్రీవెడ్డింగ్ వేడుకలో సంగీత్‌లో నృత్యం చేస్తారు. బాలీవుడ్ ఖాన్‌ల త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్,యు అమీర్ ఖాన్ సంవత్సరాల తరువాత కలిసి ఒకే వేదికపై కనిపించారు. అతిథులు అభిమానులను ఈ ఆహ్లాదకరమైన దృశ్యం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ముగ్గురూ వేదికపై సరదా పరిహాసాలు, ప్రదర్శనలతో రక్తి కట్టించారు. ఖాన్‌లు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుండి నాటు నాటు పాటకు స్టెప్పులేయడం మరో హైలైట్. మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరై ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వారితో పాటు, భారత అథ్లెట్లు - క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, సైనా నెహ్వాల్, హార్దిక్ పాండ్యా తదితరులు కూడా అతిథులుగా హాజరయ్యారు. అంతేకాకుండా వ్యాపార వర్గాల నుంచి బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ వేడుకలలో సందడి చేసారు. ఇవాంక గార్బా, దండియా నేర్చుకోవడం మరో హైలైట్. ఇదే వేడుకలకు టాలీవుడ్ నుంచి హాజరైన ఏకైక జంట రామ్ చరణ్- ఉపాసన. రిహాన్న ఈ వేడుకల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా, జాన్వీ తనతో పాటే నృత్యం చేసింది.