కూటమి ప్రభుత్వంపై అంబటి పోరాటం విజయవంతం

వైసీపీలో నాయకులు అందరిదీ ఒక తీరు.. మాజీ మంత్రి అంబట రాంబాబుది మరో తీరు.;

Update: 2025-04-03 08:39 GMT
Ambati Fight Against The NDA Government

వైసీపీలో నాయకులు అందరిదీ ఒక తీరు.. మాజీ మంత్రి అంబట రాంబాబుది మరో తీరు. అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది నాయకులు రాజకీయంగా వెనకడుగు వేస్తుంటే, అంబటి మాత్రం ప్రభుత్వంపై పోరాటానికి తొడకొట్టి సవాల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తనను, తమ పార్టీ అధినేత జగన్ ను దుర్భాషలాడుతున్న వారిపై కేసులు పెట్టడమే కాకుండా, వాటిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాలా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇలా ఐదు కేసులు పెడితే నాలుగు ఎఫ్ఐాఆర్ లు నమోదు చేసిన పోలీసులు ఓ కేసును వదిలేయడంపైనా హైకోర్టుకు వెళ్లారు. దీంతో మాజీ మంత్రి అంబటి పోరాటం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది.

సోషల్ మీడియా కేసులంటే ఇన్నాళ్లు ఒకపార్టీ వారిపైనే నమోదవుతాయనే ప్రచారం ఉండేది. వైసీపీ అధికారంలో ఉండగా, ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తే.. కూటమి అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. సోషల్ మీడియాలో దుష్ప్రవర్తన కారణంగా వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలను అరెస్టుచేసి కటకటాల వెనక్కి పంపింది. అయితే ఇదే సమయంలో తమపైనా తిట్ల దండకం చదువుతున్న సోషల్ యాక్టివిస్టులపై కేసులు నమోదు చేయాలని వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తనతోపాటు మాజీ ముఖ్యమంత్రి జగన్, తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతున్న యూట్యూబర్లపై కేసులు పెట్టారు. అయితే పోలీసులు మాత్రం ఆయన ఫిర్యాదులను తేలిగ్గా తీసుకున్నారని ఆరోపిస్తూ కోర్టులో కేసు దాఖలు చేశారు.

టీడీపీకి వ్యతిరేకంగా పోస్టింగ్ చేస్తే ఆగమేఘాల మీద అరెస్టులు చేస్తున్న పోలీసులు తమ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అంబటి ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తన వాయిస్ వినిపించేందుకు స్వయంగా ఓ యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించారు. అయితే పోలీసులు మాత్రం అంబటి ఫిర్యాదుపై యాక్షన్ తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని హైకోర్టుకు వెళ్లడం ద్వారా అంబటి విజయం సాధించారు. హైకోర్టులో తన కేసును తానే వాదించుకున్న అంబటి తాను చేసిన ఫిర్యాదుపై నాలుగుకేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. దీంతో ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని అరెస్టు చేయించే అవకాశం ఉందంటున్నారు. అంబటి మొత్తం ఐదు ఫిర్యాదులు ఇవ్వగా నాలుగు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన పోలీసులు, మిగిలిన ఒక్కదానిపై కేసు పెట్టకపోవడానికి కారణముందని న్యాయస్థానానికి తెలిపారు. దీంతో పోలీసులపై అంబటిదే పైచేయిగా నిలిచిందని అంటున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ అంబటి చేస్తున్న పోరాటం వైసీపీ శ్రేణులు ఆకట్టుకుంటోంది. వరుస అరెస్టులతో భయపడిపోతున్న వైసీపీ సోషల్ మీడియాకు అంబటి స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు కొనియాడుతున్నారు. ఆయనలా ఇతర నేతలు కూడా ముందకొస్తే సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవచ్చని అంటున్నారు. అయితే అంబటిలా ఇతర నేతలు ఎందరు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతారనేది సందేహస్పదంగానే మారిందని అంటున్నారు.

Tags:    

Similar News