ఇంత డ్యామేజ్ చేస్తున్నా.. అంబటి నోటికి తాళం వేయరా?

మాటలతో మంచి జరగకున్నా ఫర్లేదు.. ముప్పు వాటిల్లకుండా ఉంటే సరిపోతుంది.

Update: 2024-11-26 04:45 GMT

మాటలతో మంచి జరగకున్నా ఫర్లేదు.. ముప్పు వాటిల్లకుండా ఉంటే సరిపోతుంది. వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు విషయంలో ఇదే భావన వ్యక్తమవుతోంది. తరచూ ఏదో ఒక పాయింట్ పట్టుకొని.. భారీ బేస్ వాయిస్ తో మైకుల ముందుకు వచ్చే ఆయన మాటలు తరచూ విమర్శలకు గురి కావటమే కాదు.. రాజకీయ ప్రత్యర్థులు చీల్చి చెండాడేలా ఉండటం ఇబ్బందికర అంశంగా చెప్పాలి.

మొన్నటికి మొన్న పుష్ప2 విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వ్యాఖ్యలు చేసి.. విమర్శలకు గురయ్యారు. ఒకవేళ పుష్ప2 విడుదల విషయంలో కూటమి సర్కారు టార్గెట్ చేస్తున్నట్లు వ్యవహరించినా.. దానికి సంబంధించిన ఒకట్రెండు ఆధారాల్ని చూపించినా బాగుండేది. అందుకు భిన్నంగా మనసుకు తోచింది మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని అంబటి ఎప్పటికి గుర్తిస్తారు పుష్ప 2 విడుదలను అడ్డుకోవటానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అంబటి మాట ద్వారా.. కూటమి సర్కారు కంటే కూడా వైసీపీకే ఎక్కువ డ్యామేజ్ జరిగినట్లుగా చెబుతున్నారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ సినిమాను అడ్డుకోవటం.. రెవెన్యూ అధికారుల్ని పెట్టించి.. సినిమా టికెట్ ను రూ5.. రూ.10 చొప్పున అమ్మించిన ఉదంతాలు మరోసారి చర్చకురావటమే కాదు.. అప్పుడు కళ్లు మూసుకున్నారా? అంటూ అంబటిపై విరుచుకుపడుతున్నారు. ఒకవేళ.. నిజంగానే కూటమి సర్కారు పుష్ప2ను అడ్డుకునే ప్రయత్నాలు ఓపెన్ గా కానీ.. లోగుట్టుగా కానీ చేస్తుంటే.. వాటికి సంబంధించిన అధికారిక పత్రాలను.. ఆధారాల్ని చూపిస్తే బాగుండేది. అందుకు భిన్నంగా తనకు తోచిన విషయాన్ని చెప్పేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని అంబటి ఎప్పటికి గుర్తిస్తారో?

పుష్ప2 మూవీని కూటమి సర్కారు అడ్డుకోవటం లాంటి అనవసర విషయాలపై మాట్లాడిన అంబటి.. తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వైసీపీ కార్యకర్తల్ని అరెస్టు చేస్తున్నారని.. మరి టీడీపీ కార్యకర్తల్ని ఎందుకు అరెస్టు చేయటం లేదంటూ కొత్త చర్చను తెర మీదకు తీసుకొచ్చారు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల్ని పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారని.. కేసులు పెడుతున్నారన్నారు.

ఇటీవల తమ మీదా.. జగన్ కుటుంబ సభ్యుల మీదా పలువురు టీడీపీ నేతలు పెట్టిన పోస్టులకు సంబంధించి వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశామని.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతకూ అంబటి చెబుతున్న ఫిర్యాదుల పరంపర ఎప్పుడు ఇచ్చారో తెలుసా? ఆదివారం. అంటే.. ఆదివారం ఫిర్యాదులు ఇస్తే.. సోమవారానికి కేసులు పెట్టేయాల్సిందేనా? ప్రాధమిక ఆధారాలు ఏమిటన్నది కూడా చూసుకోవాల్సిన అవసరం లేదా? ఒకవేళ.. అంత జెట్ స్పీడ్ తో కేసులు పెట్టేయాల్సి ఉంటే.. గత ప్రభుత్వంలో నోటికి వచ్చినట్లుగా మాట్లాడి.. వెనుకా ముందు అన్నది లేకుండా దారుణ రీతిలో పోస్టులు పెట్టిన తమ వారి మీద వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టింది? అన్నది ప్రశ్న.

పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నెల అవుతుంది.. ఇప్పటికి స్పందించలేదు.. చర్యలు తీసుకున్నది లేదని ఆరోపించటం ఒక పద్దతి. అందుకు భిన్నంగా రోజులో చర్యల కోసం డిమాండ్ చేసే అంబటి తీరును చూస్తే.. ఆయన దూకుడు పార్టీకి మేలు కంటే కూడా కీడు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ.. నటుడు పోసాని మురళీ క్రిష్ణ మీద కేసులు పెట్టి భయపెడుతున్నారన్న అంబటి.. వారు పెట్టిన పోస్టులు.. వారు చేసిన వ్యాఖ్యలను అంబటి వెనకేసుకు వస్తారా? అలా చేయటం ద్వారా పార్టీకి పాజిటివ్ కంటే నెగిటివ్ అవుతుందన్న విషయాన్ని అంబటి ఎందుకు మిస్ అవుతున్నారు? లాజిక్ మిస్ అయి.. నిత్యం ఏదో ఒకటి మాట్లాడటం అలవాటుగా మార్చుకున్న అంబటి నోటికి తాళం అర్జెంట్ గా వేసే జాగ్రత్త తీసుకోకపోతే.. పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News