బాబును ఖాళీ చేసి పంపించు పవన్ !
ఏపీలో కూడా హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ ఒకటి రావాలని పవన్ కూడా కోరుకుంటున్న నేపథ్యం ఉంది.
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వైసీపీ నుంచి ఒక గట్టి సవాల్ ఎదురైంది. ఏపీలో వరదలు వచ్చిన నేపథ్యంలో చెరువులు వాగులు వంకలు కట్టి ఆక్రమణలు చేయడం వల్లనే ఇదంతా వచ్చింది అని అంతా అంటున్న నేపధ్యం ఉంది. ఏపీలో కూడా హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ ఒకటి రావాలని పవన్ కూడా కోరుకుంటున్న నేపథ్యం ఉంది.
అంతే కాదు బుడమేరు పొంగి పొరలినందుకు కారణాలు చెబుతూ అక్కడ ఆక్రమణల మీద కూడా పవన్ చాలా గట్టిగానే మాట్లాడారు. దాంతో ఆయనకు వైసీపీ నుంచి ఇపుడు ప్రశ్నలు వస్తున్నాయి. చెరువులు నదుల వద్ద ఆక్రమణలు అంటున్న పవన్ కి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కరకట్ట ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా అని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు
బఫర్ జోన్ లో బాబు కరకట్ట ఇల్లు ఉందని పవన్ కి గుర్తు చేసిన అంబటి రాంబాబు ముందు దానికి కూల్చి చంద్రబాబుని అక్కడ నుంచి ఖాళీ చేసి పంపించగలరా పవన్ అని అంబటి సరైన సవాల్ నే చేశారు. బుడమేరు పరీవాహక ప్రాంతాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని పవన్ అనడం కాదు వాటిని కూల్చే ముందు చంద్రబాబుతోనే దానిని ప్రారంభించాలని డిమాంద్ చేసారు.
చంద్రబాబు నివాసం బఫర్ జోన్ లో ఉంది అన్న విషయం అయినా పవన్ కి తెలుసా అని ప్రశ్నించారు. పవన్ కి చిత్తశుద్ధి ఉంటే ముందు బాబు నివాసమే కూల్చి శభాష్ అనిపించుకోవాలని అంబటి అన్నారు. మాటలతో కాదు చేతలకు పవన్ దిగాలని కూడా సూచించారు.
నిజానికి చంద్రబాబు నివాసం వరద నీటిలో మునగడం తో పవన్ కి వరదలు గుర్తుకు వచ్చాయని అంబటి సెటైర్లు వేశారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా కాకుండా సీఎం గా వ్యవహరించాలని చూస్తున్నారు అని కూడా అంబటి అనడం విశేషం.
బెజవాడ వరదలు బాబు పుణ్యమే అని అంబటి అన్నారు. చంద్రబాబు అసమర్థ నిర్వాకం కూడా ఈ వరదలతో బయటపడింది అని అన్నారు వరదలు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని కూడా అంబటి డిమాండ్ చేశారు.
వైసీపీ అధినేత జగన్ విజయవాడ వచ్చాక కానీ పవన్ లో చలనం రాలేదు అని కూడా అన్నారు. ఇక చంద్రబాబు వరదలు వస్తే ఎలా వ్యవహరించాలో కూడా తెలియదు అని అందుకే ఇంతటి భారీ నష్టం జరిగింది అని అన్నారు. బాబు చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద బురద జల్లుతున్నారని అంబటి ఆరోపించారు
వైఎస్ జగన్ వల్ల వరదలు వచ్చాయని బాబు చెప్పడమేంటని అంబటి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎంతసేపూ వైసీపీ మీదకే ప్రతీ విషయాన్ని నెట్టేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఏపీలో వరదల వల్ల భారీ నష్టం జరిగింది అంటే అది కచ్చితంగా ప్రభుత్వ ఉదాశీనత నిర్లక్ష్యం అని కూడా అన్నారు. మొత్తానికి పవన్ కి బాబుకు మధ్య పెట్టేశారు అంబటి. మరి ఆక్రమణల మీద మాట్లాడుతున్న పవన్ కరకట్ట నివాసాలను నిర్మాణాలను కూల్చమని అధికారులకు ఆదేశాలు ఇవ్వగలరా అన్నదే ప్రశ్న. ఏది ఏమైనా వరదలు కాదు కానీ టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం ఒక లెవెల్ లో సాగుతోంది.