వైసీపీ జెండా ఎత్తిన అంబటి రాయుడు...!
తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలసిన అంబటి వైసీపీ పార్టీలో లాంచనంగా చేరిపోయారు.
అనుకున్నదే అయింది. ఎట్టకేలకు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాను కోరుకున్న పార్టీలోనే చేరారు. ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలసిన అంబటి వైసీపీ పార్టీలో లాంచనంగా చేరిపోయారు. జగన్ ఆయన్ని సాదరంగా పార్టీలోకి అహ్వానించారు.
దానితో పాటుగా అంబటిని జగన్ హత్తుకోవడం చూసిన వారిలో ఆసక్తిని పెంచేసింది. తాను రాజకీయాలో తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్లుగా అంబటి ఈ సందర్భంగా ప్రకటించారు. తాను వైసీపీలో చేరడం ఆనందం కలిగించే విషయం అని కూడా చెప్పారు. మొదటి నుంచి జగన్ అంటే తనకు ఇష్టమని అంబటి స్టేట్మెంట్ ఇచ్చారు.
అంతే కాదు వైసీపీలో అమలు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా తనను ఆకట్టుకున్నా యని అంబటి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అంటే తనకు మంచి అభిప్రాయం ఉందని, ప్రత్యేక అభిమానం కూడా ఉందని అంబటి చెప్పుకొచ్చారు. జగన్ మార్క్ పాలిటిక్స్ కుల మతలతో సంబంధం లేకుండా సాగడమే తనను ఆ పార్టీ పట్ల ఆకర్షితులను చేసింది అని అంబటి చెప్పారు.
ముఖ్యమంత్రిగా జగన్ పాలన పారదర్శకంగా సాగుతోందని కూడా కితాబు ఇచ్చారు. మొత్తానికి చూస్తే అంబటి తాను కోరుకున్న పార్టీలో చేరారు. చాలా కాలంగా ఆయన వైసీపీలో చేరుతారు అని అంతా అనుకున్నారు. దానికి తగినట్లుగానే ఆయన అడుగులు పడ్డాయి. మరి అంబటి ఇపుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది చర్చగా ఉంది.
ఆయన ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. అయితే అంబటి రాయుడు గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు. అక్కడ ఆయన సామాజికవర్గం అధికంగా ఉన్నారు. పైగా గుంటూరు జిల్లా అంబటి సొంత జిల్లా కావడం వల్ల వైసీపీ ఆయనకు ఆ విధంగా ప్రాధాన్యత ఇస్తూ ఆయన సేవలను పార్లమెంట్ కే వాడుకుంటుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే అంబటి రాయుడు చేరికతో యూత్ లో వైసీపీ పట్ల కొత్త అభిప్రాయం ఏర్పడే చాన్స్ ఉంది అని అంటున్నారు. అలాగే ఏపీ రాజకీయాలో ప్రధాన భూమిక వహించే కీలక సామాజిక వర్గం కూడా వైసీపీ వైపు పాజిటివ్ గా చూసే పరిస్థితి ఉంటుందని కూడా ఊహిస్తున్నారు. మొత్తం మీద అంబటి రాయుడు వైసీపీ జెండా ఎత్తారు. ఇక ఆయన పొలిటికల్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.