అంబటి రాయుడు 'యూటర్న్'.. ఏం జరిగింది?
తాజాగా మంగళగిరిలోని అక్షయపాత్ర వంటశాలను పరిశీలించిన ఆయన విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని రుచి చూశారు.
భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు.. ఇంకే ముంది రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని.. ఆయన వైసీపీ తీర్థం పుచ్చేసుకుంటు న్నారని.. ఆయనను ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో.. ఈసారి రంగంలోకి దింపేస్తారని పెద్ద ఎత్తున గత వారం కథనాలు వచ్చాయి.
దీనిపై మెజారిటీ మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు.. కాపు సామాజిక వర్గం యువ క్రికెటర్ కావడంతో ఆ వర్గాన్ని టార్గెట్ చేసుకుని వైసీపీ లబ్ధి పొందేందుకు ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా కూడా చేస్తుందని వ్యాఖ్యలు వినిపించాయి.
అయితే.. ఇంతలోనే ఏమైందో ఏమో.. అనూహ్యంగా అంబటి రాయుడు ప్లేట్ మార్చారు. తాను ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని, తనకు ఆ ఉద్దేశం లేదని తాజాగా చెప్పుకొచ్చారు. తాజాగా మంగళగిరిలోని అక్షయపాత్ర వంటశాలను పరిశీలించిన ఆయన విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని రుచి చూశారు.
అదే సమయంలో అక్షయ పాత్ర సంస్థ నిర్వాహకుల తోనూ చర్చించారు. అనంతరం.. ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో రావాలన్న ఇంట్రస్ట్ తనకు లేదన్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు తాను ఏ పార్టీకీ అనుకూలం కాదన్నారు.
ప్రస్తుతం తాను సామాజిక అధ్యయనంపై దృష్టి పెట్టినట్టు రాయుడు చెప్పారు. అంతేకాదు.. తాను క్రికెట్ నుంచి తప్పుకోలేదన్నా రు.రాష్ట్రం తరఫున ఐపీఎల్ జట్టుకు సహకరిస్తానని చెప్పారు. క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
మొత్తా నికి రాయుడు చేసిన ప్రకటన రాజకీయంగా మరోసారి చర్చకు వచ్చింది. దీని వెనుక ఏం జరిగిందనే విషయంపై మేధావులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అంత బాగా లేవనేది అందరికీ తెలిసిందే.
ఎంత క్లీన్ ఇమేజ్ ఉన్నా.. రాజకీయాల్లోకి వచ్చాక.. అనాలి.. అనిపించుకోవాలి. దీనికి అందరూ సిద్ధపడరు. పైగా క్రికెట్‌లో రాటు దేలి ప్రపంచ ఖ్యాతిని పొందిన అంబటి రాయుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే.. ఉన్న ఇమేజ్ పోతుందనే వాదన అభిమానుల నుంచి వినిపిస్తోంది.
దీంతో ఆయన యూటర్న్ తీసుకున్నారనే చర్చసాగుతుండడం గమనార్హం. అయితే.. మరోవైపు.. తనకు క్రికెట్ విషయంలో సహకరించిన టీడీపీ ప్రభుత్వం చేసిన మేళ్లను ఆయన మరిచిపోలేక పోతున్నారనే వాదన కూడా ఉంది. అందుకే ఆయన దూరంగా ఉంటున్నారనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది.