అండమాన్‌లో మరోసారి ఉద్రిక్తత.. నిషేధిత ద్వీపానికి వెళ్లిన అమెరికన్ అరెస్ట్!
అండమాన్ నికోబార్ దీవులలోని అత్యంత ప్రమాదకరమైన, నిషేధిత గిరిజన ప్రాంతమైన నార్త్ సెంటినెలీస్ ద్వీపంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఒక అమెరికన్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.;

అండమాన్ నికోబార్ దీవులలోని అత్యంత ప్రమాదకరమైన, నిషేధిత గిరిజన ప్రాంతమైన నార్త్ సెంటినెలీస్ ద్వీపంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఒక అమెరికన్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మైఖైలో విక్టోరోవిచ్ పోల్యాకోవ్ (24) అనే వ్యక్తిని CID పోలీసులు మార్చి 31న అరెస్టు చేశారు. అతను ఎలాంటి అనుమతి లేకుండా నార్త్ సెంటినెలీస్ ద్వీపంలోకి చొరబడ్డాడని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోల్యాకోవ్ మార్చి 26న పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి కుర్మా డేరా బీచ్ ద్వారా నార్త్ సెంటినెలీస్ ద్వీపానికి వెళ్లాడు. మార్చి 29న తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో కుర్మా డేరా బీచ్ నుంచి తన పడవతో బయలుదేరాడు. సెంటినెలీస్ గిరిజనులకు "నైవేద్యం"గా ఒక కొబ్బరికాయ, ఒక కూల్ డ్రింక్ డబ్బాను తీసుకెళ్లాడు.
ఉదయం 10 గంటలకల్లా పోల్యాకోవ్ నార్త్ సెంటినెలీస్ ద్వీపం ఈశాన్య తీరానికి చేరుకున్నాడు. బైనాక్యులర్స్‌తో ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ అతనికి అక్కడ ఎవరూ కనిపించలేదు. దాదాపు ఒక గంట పాటు తీరం వద్ద వేచి ఉండి, విజిల్ వేసి వారి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించాడు, కానీ ఎలాంటి స్పందన రాలేదు.
అనంతరం, అతను సుమారు ఐదు నిమిషాల పాటు తీరంపై దిగి, అక్కడ నైవేద్యాలను ఉంచి, కొంత ఇసుకను నమూనాగా సేకరించాడు. తిరిగి తన పడవలోకి వెళ్లే ముందు ఒక వీడియోను కూడా రికార్డ్ చేశాడు. మధ్యాహ్నం 1 గంటకు తిరుగు ప్రయాణం ప్రారంభించి సాయంత్రం 7 గంటలకు కుర్మా డేరా బీచ్‌కు చేరుకున్నాడు. అక్కడ స్థానిక మత్స్యకారులు అతన్ని గుర్తించారు.
డీజీపీ హెచ్‌ఎస్ ధాలివాల్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. "అతని గురించి, ఆ ప్రత్యేక గిరిజన ప్రాంతాన్ని సందర్శించడానికి గల అతని ఉద్దేశాల గురించి మరింత సమాచారం సేకరిస్తున్నాము. అతను అండమాన్, నికోబార్ దీవులలో ఉన్న సమయంలో ఇతర ప్రదేశాలను కూడా సందర్శించాడా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. పోర్ట్ బ్లెయిర్‌లో అతను బస చేసిన హోటల్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నాము" అని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోల్యాకోవ్ తన ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. సముద్ర పరిస్థితులు, అలలు, కుర్మా డేరా బీచ్ నుంచి ద్వీపానికి చేరుకునే మార్గం గురించి ముందుగానే పరిశోధన చేశాడు. తన ప్రయాణమంతా GPS నావిగేషన్‌ను ఉపయోగించాడు.
ఉక్రేనియన్ మూలాలున్న పోల్యాకోవ్ వద్ద ఒక GoPro కెమెరాను పోలీసులు గుర్తించారు. దానిలో రికార్డ్ చేసిన దృశ్యాల్లో అతను నార్త్ సెంటినెలీస్ ద్వీపంలో దిగినట్లు స్పష్టంగా ఉంది. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు అతన్ని మరింత విచారణ కోసం పోలీసు కస్టడీలో ఉంచారు. ఈ ఏడాది జనవరిలో కూడా అతను దీవులకు వచ్చాడు. తన పడవ కోసం ఒక మోటారును సంపాదించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను బారాటాంగ్ దీవులకు వెళ్లి, జరవా గిరిజనులను చట్టవిరుద్ధంగా వీడియో తీశాడని పోలీసులు తెలిపారు. తన మీద పలు సెక్షన్ల కింద FIR నమోదు చేశారు.