అమెరికాలో తెలుగు యువకుడి హత్యలో కీలక మలుపు!
ఈ ఘటనకు సంబంధించి ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు
ఈ ఏడాది అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఏమాత్రం అచ్చిరావడం లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ ప్రమాదాలు, హత్యలకు గురై ఏకంగా 14 మంది మరణించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. కాగా రెండు రోజుల క్రితం అమెరికాలోని డల్లాస్ లోని ఒక సూపర్ మార్కెట్ లో ఓ దుండగుడి తుపాకీ కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ (32) మరణించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించి ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. నిందితుడు గోపీకృష్ణ తలతోపాటు శరీరంపై పలు చోట్ల కాల్పులు జరిపాడు. ముందు నిందితుడిపై దోపిడీ కేసు పెట్టిన పోలీసులు అతడిపై హత్యానేరం కూడా మోపారు.
32 ఏళ్ల గోపీకృష్ణపై కాల్పులు జరిపిన నిందితుడి వయసు కేవలం 21 ఏళ్లే కావడం గమనార్హం. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు. బెయిల్ కావాలంటే కోర్టుకు అతడు 7.5 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.
కాగా నిందితుడికి గతంలోనూ నేర చరిత్ర ఉందని తెలుస్తోంది. అతడు గన్ కల్చర్ కు బాగా అలవాటుపడ్డాడని సమాచారం. గోపీకృష్ణను కాల్చడానికి ముందు వాకో సిటీలో ఒక వృద్ధుడిని కాల్చిచంపాడనే అభియోగాలు నిందితుడిపై నమోదయ్యాయి.
అమెరికాలో పెచ్చరిల్లుతున్న గన్ కల్చర్ కు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అమెరికాలోని పలు పాఠశాలల్లో చిన్నారులపై ఒక సైకో జరిపిన కాల్పుల్లో పదుల సంఖ్యలో చిన్నారులు మరణించారు. నాడు అమెరికా జో బైడెన్ కన్నీరు పెట్టుకున్నారు. అమెరికాలో గన్ కల్చర్ కు అడ్డుకట్ట వేస్తామన్నారు. ఈ మేరకు అమెరికా చట్ట సభల్లో గన్ కల్చర్ ను నియంత్రించడానికి బిల్లులు ప్రవేశపెడతామని తెలిపారు. అయినప్పటికీ ఈ కాల్పుల ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఇవి ఎక్కువ కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
కాగా రైతు కూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు గోపీకృష్ణ ఏకైక కుమారుడు. బీటెక్ చదివిన అతడు హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ హెచ్–1బి వీసా రావటంతో 11 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. మరో వైపు డెల్లాస్ సిటీలోని సూపర్ మార్కెట్ లో పార్ట్ టైమ్ విధానంలో పనిచేస్తున్నాడు. రెండున్నరేళ్ల క్రితం అతడికి పెళ్లయింది. ఏడాదిన్నర వయసు గల కుమారుడు కూడా ఉన్నాడు.
ఈ క్రమంలో జూన్ 21 రాత్రి ఓ దుండగుడు డెలావేర్ లోని సూపర్ మార్కెట్ కు వచ్చి గోపీకృష్ణపై కాల్పులు జరిపి ఏవో వస్తువులు తీసుకుని పారిపోయాడు. కాల్పుల ఘటనలో తీవ్ర గాయాలయిన గోపీకృష్ణను స్థానికులు దగ్గరలోని ఒక ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు.