అమిత్ షా బాబు విందు మంతనాలు ?

కేంద్ర హోంమంత్రి బీజేపీ దిగ్గజ నేత అమిత్ షా రెండు రోజుల పర్యటన ఏపీలో పెట్టుకున్నారు.

Update: 2025-01-18 12:15 GMT

కేంద్ర హోంమంత్రి బీజేపీ దిగ్గజ నేత అమిత్ షా రెండు రోజుల పర్యటన ఏపీలో పెట్టుకున్నారు. అమిత్ షా శనివారం ఆదివారం ఏపీలో ఉంటారు. శనివారం రాత్రి ఉండవల్లిలోని బాబు నివాసంలో అమిత్ షా విందు ఆరగిస్తారు అని అంటున్నారు. ఈ సందర్భంగా బాబు అమిత్ షాల ప్రత్యేక భేటీలో అనేక రాజకీయ అంశాలు చర్చకు వస్తాయని అంటున్నారు.

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చారు. ఆయన వేదిక మీద చంద్రబాబు విజనరీని పొగిడి వెళ్లారు. బాబు సైతం మోడీని ప్రపంచ నాయకుడు అని కీర్తించారు. కట్ చేస్తే ఇపుడు అమిత్ షా ఏకంగా చంద్రబాబు ఇంటికే విందుకు వస్తున్నారు.

ఏపీలో టీడీపీ కూటమి మరిన్ని ఎన్నికలకు కలసి వెళ్లాలని చూస్తోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా టీడీపీ దోస్తీని వీడరాదని చూస్తోంది. ఇక జనసేన అయితే ఈ రెండు పార్టీలను కలపడానికి ఎంత చేయాలో అంతా చేసింది. అలా ఈ మూడు పార్టీల మధ్య స్నేహం మరింతగా బలపడుతోంది.

ఈ నేపధ్యంలో బీజేపీ రాజకీయ వ్యవహారాలను మొత్తం చూసే అమిత్ షా ఏపీకి వస్తున్నారు అంటేనే రాజకీయంగా అది చర్చగా మారుతోంది. బాబుతో ఆయన ఏమి మాట్లాడుతారు అన్నది కూడా ఆసక్తిని రేపుతోంది. ఏపీలో కూటమిని సమీప భవిష్యత్తులో కూడా ఎదురు లేకుండా చేసుకోవడానికి ఏమి చేయాలో అన్నది కూడా కూటమి పెద్దలు ఆలోచిస్తారు అని అంటున్నారు.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరుకుంటారని అంటున్నారు. ముగ్గురు నేతలూ కలసి ఏపీలోనూ దేశంలోనూ వర్తమాన రాజకీయాలను గురించి కీలక చర్చలు చేస్తారు అని అంటున్నారు. అమిత్ షా ఆదివారం కృష్ణా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి వెళ్తారు అని అంటున్నారు.

ఇక అమిత్ షా ఏపీకి రావడం వెనక బాబు ఇంటికి స్వయంగా వెళ్ళి విందులో పాల్గొనడం వెనక ప్రత్యేక వ్యూహాలు ఏమి ఉంటాయన్నది కూడా రాజకీయ విశ్లేషకులకు ఆసక్తిని పెంచుతోంది. అమిత్ షా అంటేనే రాజకీయ వ్యూహాలకు చాణక్యుడు అని చెబుతారు. ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలి సెషన్ స్టార్ట్ కాబోతున్నాయి. అదే విధంగా కీలక బిల్లులు ఈసారి బడ్జెట్ సెషన్ లో రాబోతున్నాయని అంటున్నారు.

మరి వాటి గురించి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ జనసేనలతో అమిత్ షా చర్చిస్తారు అని అంటున్నారు. అలాగే ఏపీకి సంబంధించిన రాజకీయ పరిస్థితులు ఆయన దృష్టిలో పెట్టి చేయాల్సిన కార్యక్రమాలు కార్యాచరణ గురించి కూడ టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతారు అంటున్నారు. చూడాలి మరి అమిత్ షా ఏపీ టూర్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో.

Tags:    

Similar News