నేరస్తులు ఇక తప్పించుకోలేరు.. కేంద్రం కీలక నిర్ణయం
అంతర్జాతీయ స్థాయిలో అన్నిదేశాల పోలీసుల మధ్య సమన్వయం కోసం.. నేరస్తుడిని పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ పనిచేస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో అన్నిదేశాల పోలీసుల మధ్య సమన్వయం కోసం.. నేరస్తుడిని పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ పనిచేస్తోంది. నిందితులపై వివిధ దేశాలకు సమాచారాన్ని చేరవేయడం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో నేరాలకు పాల్పడి.. విదేశాల్లో దాక్కునే వారిని అరెస్ట్ చేసి.. స్వదేశానికి తీసుకొచ్చి శిక్ష వేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌పోల్‌ను తీసుకువచ్చింది. భారతదేశంలో నేరగాళ్లకు ఉచ్చు బిగించేందుకు హోం మంత్రిత్వ శాఖ సిద్ధం అయింది. అందులో భాగంగానే నేడు ‘భారత్‌పోల్’ను ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిని ప్రారంభించారు. ఇది కూడా ఇంటర్‌పోల్ తరహాలోనే పనిచేయనుంది. ఇది నేరస్తుల గురించి సమాచారాన్ని పంచుకోవడానికి, వారిపై తక్షణ చర్యలు తీసుకోవడానికి పనిచేస్తుంది.
విదేశాల్లో కూర్చొని భారత్‌లో నేరాలకు పాల్పడుతున్న వారి భరతం పట్టేందుకు కేంద్రం సిద్ధమైందనే చెప్పాలి. అంతర్జాతీయ నేరస్తులను పట్టుకోవడం సులభతరం చేసేందుకు సిద్ధం చేసింది. విదేశాలకు పారిపోయే లేదా దేశంలో క్రైమ్ సిండికేట్లను నడుపుతున్న విదేశీ నేరస్తులపైనా చర్యలు తీసుకునేందుకు రాష్ట్రాల పోలీసులకు ఇప్పుడు భారత్‌పోల్ ఆయుధంగా మారనుంది.
‘భారత్‌పోల్’ ద్వారా నేరస్తులను పట్టుకోవడమే కాకుండా సకాలంలో వారిపై ఉక్కుపాదం మోపేందుకు ఉపయోగపడనుంది. నేరాలను నిర్మూలించడమే లక్ష్యంగా ‘భారత్‌పోల్’ పనిచేయనుంది. ఇది అధునాతన ఆన్‌లైన్ పోర్టల్ అని చెప్పాలి. దీనిని సీబీఐ తయారుచేసింది. ఇంటర్‌పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పోలీసు సంస్థ. 195 దేశాల పరిశోధన సంస్థలకు ఇది కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థ 1923 నుంచి పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో ఉంది.
భారతదేశంలో, విదేశాలలో దాక్కున్న నేరస్తులను అరెస్ట్ చేయడానికి లేదంటే వారి గురించి సమాచారం పొందడానికి రాష్ట్ర పోలీసు, దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు తరచూగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుత ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సీబీఐని సంప్రదించాలి. ఆ తర్వాత సీబీఐ ఇంటర్‌పోల్‌ను సంప్రదించి అవసరమైన నోటీసులు జారీ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ కాస్త క్లిష్టంగానే ఉండడమే కాకుండా చాలా వరకు సమయం పోతుంది. ఈ సమస్య బారి నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్‌పోల్’ను నేడు ప్రారంభిస్తోంది. దీని సహాయంతోనే నేరస్తులకు రెడ్ నోటీసులు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర అవసరమైన ఇంటర్‌పోల్ నోటీసులను జారీ చేయనున్నారు. ఇప్పటివరకు నేరస్తుల అభ్యర్థనను ట్రాక్ చేయాలనుకుంటే రాష్ట్రాలు సీబీఐకి మరోసారి ఈ మెయిల్ లేదా ఫ్యాక్స్ చేయాలి. కానీ.. ‘భారత్‌పోల్’లో వారి అభ్యర్థనను ట్రాక్ చేసే అవకాశం ఉంది. ఇంటర్‌పోల్‌తోనూ కమ్యూనికేషన్‌ను కొనసాగించనుంది.