వైఎస్సార్ గురించి అమిత్ షా తో చంద్రబాబు చెప్పింది ఇదేనా?
ఈ క్రమంలో చంద్రబాబుతో సుమారు అర్ధగంట పాటు అమిత్ షా అంతరంగికంగా చర్చించారని అంటున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు గన్నవరం విమానాశ్రయం వద్ద శనివారం రాత్రి ఘనస్వాగతం లభించింది. ఇందులో భాగంగా... ఆయనకు కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.
ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కుని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం తహతహలాడూతుందని ఇంతకాలం చర్చ నడిచిన వేళ.. ఇటీవల దానికి భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీనిపై ఏపీ సర్కార్ నుంచి హర్షం వ్యక్తం అయ్యింది. ఈ సమయంలో అమిత్ షా ఏపీలో పర్యటించడంతో కేబినెట్ మొత్తం గ్రాండ్ వెల్ కం చేసినట్లు చెబుతున్నారు.
అనంతరం రాత్రి 9 గంటల తర్వాత ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న అమిత్ షా.. అక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్ డిన్నర్ ను ఆస్వాధించారని.. ఈ క్రమంలో చంద్రబాబుతో సుమారు అర్ధగంట పాటు అమిత్ షా అంతరంగికంగా చర్చించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు భారతరత్న అంశం మరోసారి చర్చకు వచ్చిందని చెబుతున్నారు.
దీంతో... ఇది అన్నగారి అభిమానులకే కాదు.. తెలుగువారికి గుడ్ న్యూస్ అని అంటున్నారు. టీడీపీతో కలిసి ఎక్కువకాలం కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలతో చంద్రబాబు & కో.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరడం.. అందుకు కేంద్రంలోని పెద్దలు సానుకూలంగా స్పందించారని చెప్పడం మరోసారి జరిగిందని చెబుతున్నారు. ఈ సారైనా ఫలించాలని అంటున్నారు.
ఏది ఏమైనా... అమిత్ షా తో భేటీ అయిన వేళ ఎన్టీఆర్ కు భారతరత్న విషయంపై చంద్రబాబు ప్రస్థావించారని.. ఈ సందర్భంగా పీవీ నరసింహారావును గుర్తించిన కేంద్రం ఎన్టీఆర్ ను గుర్తించలేదనే విషయాన్ని గుర్తుచేశారని అంటున్నారు. ఈ సమయంలోనే పీవీ ఏపీకి సీఎంగా పనిచేశారని.. 15 నెలలు మాత్రమే ఉన్నారని అమిత్ షాకు బాబు చెప్పారని అంటున్నారు.
ఈ సమయంలో... కాంగ్రెస్ తరుపున ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు అని అమిత్ షా ఆరా తీయగా... అందుకు స్పందించిన చంద్రబాబు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సమాధానం ఇచ్చారని అంటున్నారు. ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఆరేళ్లు పరిపాలించినట్లు గుర్తు చేశారని చెబుతున్నారు.
ఇలా... మరోసారి ఎన్టీఆర్ కు భారతరత్న అంశం గురించి అమిత్ షా వద్ద చంద్రబాబు ప్రస్థావించడం.. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు ప్రస్థావనకు వచ్చిందని చెప్పడం ఆసక్తిగా మారింది. కాగా... వైఎస్సార్, చంద్రబాబు ఇద్దరూ ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే!