డీలిమిటేషన్ గొడవ.. అభయమిచ్చిన అమిత్ షా!
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పై చర్చ నడుస్తోంది. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి..రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎందుకు దుమ్మెత్తి పోసుకుంటున్నారు అని సగటు పౌరుడు బుర్ర పట్టుకుంటున్నాడు.
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పై చర్చ నడుస్తోంది. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి..రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎందుకు దుమ్మెత్తి పోసుకుంటున్నారు అని సగటు పౌరుడు బుర్ర పట్టుకుంటున్నాడు. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే వచ్చే ఏడాదే లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది..ఈ నేపథ్యంలో తమిళనాడు సహ దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీ నేతలు డీలిమిటేషన్ పై వాదోపవాదాలు చేస్తున్నారు.
ఇంతకీ డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఏంటో తెలుసుకుందాం.. దేశంలో, రాష్ట్రంలో చట్టసభ నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియే డీలిమిటేషన్. సులభంగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంట్ లో, అసెంబ్లీలో సీట్లుండేలా చూసే ప్రక్రియ. అంటే మారుతుండే జనాభాను బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేసుకునేలా మన రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. అయితే దీన్ని ప్రతి పదేళ్లకొకసారి జనగణన జరిగిన తర్వాత చేసేవారు. అయితే 1973 ఇలా చేయడాన్ని ఆపేశారు. 1973లో లోక్ సభ సీట్లు 543కు పెరిగాయి. ఆ తర్వాత జనాభా పెరిగినా మళ్లీ డీలిమిటేషన్ లో భాగంగా సీట్లు పెంచలేదు. కారణం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 ఏండ్ల పాటు డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపివేశారు. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేలా రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2001లో మళ్లీ వాజ్ పేయి సర్కార్ మరో 25 ఏండ్లు పొడిగించారు. అంటే 2026వరకు అన్నమాట. కరోనా కారణంగా 2021లో జనగణన జరుగలేదు. డీలిమిటేషన్ గడువు వస్తుండడంతో.. ఇప్పుడు జనగణన, డీలిమిటేషన్ చేయాల్సి ఉంది.
అయితే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త భయం మొదలైంది. గత నాలుగు దశాబ్దాలుగా ఈ రాష్ట్రాలు జనాభా నియంత్రణను విజయవంతంగా చేపట్టాయి. దీంతో జనాభా బాగా తగ్గింది. కానీ ఉత్తరాదిలో విపరీతంగా పెరిగింది. దీని వల్ల డీలిమిటేషన్ లో దక్షిణాదిన లోక్ సభ సీట్లు గణనీయంగా తగ్గుతాయి. దీని ద్వారా పార్లమెంట్ లో ప్రాతినిధ్యం తగ్గడం ద్వారా రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులను దక్షిణాది కోల్పోతుంది..అందుకే దక్షిణాది నేతలు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈనేపథ్యంలో శివరాత్రి సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూర్ ఈశా కేంద్రంలో కేంద్ర హోంమంత్రి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు తగ్గవని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ పై సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రోరేటా విధానంలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా తగ్గదని పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగనివ్వమని అమిత్ షా సెలివిచ్చినా.. దక్షిణాది నేతల్లో మాత్రం ఆ భయం పోవడం లేదు. డీలిమిటేషన్ పై స్టాలిన్ కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుబోతుందో అదే ఫైనల్ కానుంది. దక్షిణాది ప్రజల భయాలను తొలగించడానికి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.