జూనియర్ కుమారస్వామిని ప్రోత్సహిస్తున్న బీజేపీ !

అయితే ఆ తరువాత కొంతమంది ఎమ్మెల్యేలను తిప్పుకుని తన ప్రభుత్వాన్ని పూర్తి చేసింది.

Update: 2024-12-22 03:32 GMT

కర్ణాటకలో బీజేపీకి పట్టుంది. కానీ పూర్తి పట్టుని సాధించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. 2018లో సైతం బీజేపీ పూర్తిస్థాయిలో మెజారిటీని సాధించలేకపోయింది. అయితే ఆ తరువాత కొంతమంది ఎమ్మెల్యేలను తిప్పుకుని తన ప్రభుత్వాన్ని పూర్తి చేసింది. ఇక 2023 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు అయింది. కానీ 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని అత్యధిక ఎంపీ సీట్లను గెలిచింది. ఒక విధంగా బీజేపీ రాజకీయ వ్యూహం కర్ణాటకలో సక్సెస్ అయింది.

బీజేపీ భవిష్యత్తులో కూడా కర్ణాటకలో బలంగా మారాలని చూస్తోంది. ఈ క్రమంలో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉన్న జేడీఎస్ కి కీలకమైన ఉక్కు గనుల మంత్రిత్వ శాఖను కేబినెట్ హోదాతో కట్టబెట్టింది. ఆ విధంగా మాజీ సీఎం కుమార స్వామి కేంద్ర మంత్రి అయ్యారు.

ఇదిలా ఉంటే ఆయన తనయుడు కర్ణాటక జేడీఎస్ యువజన విభాగం అధ్యక్షుడు అయిన నిఖిల్ కుమారస్వామి ఈ మధ్యన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మరింత చురుకుగా పనిచేయాలని కర్ణాటకలో ఎన్డీయే విజయానికి కృషి చేయాలని అమిత్ షా సూచించినట్లుగా మీడియాకు ఆయన చెప్పారు.

బీజేపీ చూపు ఈ విధంగా జూనియర్ కుమారస్వామి మీద పడింది అని అంటున్నారు. తొంబయ్యేళ్ళు దాటిన దేవెగౌడ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన కుమారుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇపుడు మూడవ తరంలో నిఖిల్ కుమారస్వామిని బీజేపీ ప్రోత్సహ్హిస్తోంది అని అంటున్నారు.

కర్ణాటకలో బలమైన సామాజిక వర్గానికి చెందిన దేవెగౌడ కుటుంబానికి రెండు మూడు జిల్లాలలో గట్టి పట్టు ఉంది. రానున్న రోజులలో నిఖిల్ కుమారస్వామి జేడీఎస్ అధ్యక్షుడు అవుతారు అని కూడా అంటున్నారు. కుమారస్వామికి ఆయన అసలైన వారసుడిగా ఉన్నారు

దాంతో దక్షిణాదిన బలపడడానికి బీజేపీ కర్ణాటకను గేట్ వేగా చేసుకుంటోంది. అందుకే జేడీఎస్ తో బంధాన్ని మరింత గట్టిగా పెనవేసుకునేలా చేసుకోవడం అంటున్నారు. మూడవ తరం జేడీఎస్ వారసుడిని కూడా తమ వైపుగా తిప్పుకుంటే రానున్న రోజులలో కర్ణాటకలో కాంగ్రెస్ మీద పూర్తిగా రాజకీయ ఆధిపత్యం చలాయించవచ్చూన్ని మరోదఫా అక్కడ అధికారాన్ని అందుకోవచ్చునని బీజేపీ ఆలోచిస్తోంది. ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన తరఫున బలమైన మిత్రుడిగా ఉన్నారు.

తమిళనాడులో కూడా బలమైన మిత్రుల కోసం బీజేపీ వేట సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం చూస్తామని తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై ఇటీవల ప్రకటించారు. తెలంగాణాలో కూడా బీజేపీ సరైన దోస్తీ కోసం చూస్తోంది. ఇలా బీజేపీ సౌత్ నుంచే వచ్చే ఎన్నికల్లో గణనీయమైన సీట్లను అందుకోవాలని చూస్తోంది అంటున్నారు.

Tags:    

Similar News