Begin typing your search above and press return to search.

కీలక మహిళా మంత్రిపై ఆ కేసు నమోదు!?

మోదీ 2.0లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఆమె ఇప్పుడు మోదీ 3.0లోనూ అదే పదవిని దక్కించుకుని రికార్డు సృష్టించారు.

By:  Tupaki Desk   |   28 Sep 2024 8:41 AM GMT
కీలక మహిళా మంత్రిపై ఆ కేసు నమోదు!?
X

నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కీలక ఆర్థిక శాఖకు కే బినెట్‌ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ చక్రం తిప్పుతున్నారు. కేంద్రంలో కీలకమైన నాలుగు శాఖ (హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక శాఖలు)ల్లో ఒక శాఖ అయిన ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల మంచి పనితీరును కనబరుస్తున్నారు. మోదీ 2.0లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఆమె ఇప్పుడు మోదీ 3.0లోనూ అదే పదవిని దక్కించుకుని రికార్డు సృష్టించారు.

అట్టహాసాలు, ఆడంబరాలకు దూరంగా ఉంటూ నిరాడంబరంగా కనిపించే నిర్మలా సీతారామన్‌ పై తాజాగా ఎఫ్‌ఐర్‌ నమోదు కావడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆమె కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్‌ నగర ఠాణా పోలీసులకు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మలా సీతారామన్‌ బెదిరించారని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ బెదిరింపుల ద్వారా బీజేపీకి నిధులు వచ్చేలా చేశారనేది ఆరోపణ. ఈ మేరకు జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్‌ అయ్యర్‌ గతంలో బెంగళూరు తిలక్‌ నగర ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిర్మలా సీతారామన్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 10కి వాయిదా వేసింది.

కోర్టు ఆదేశాల మేరకు నిర్మలా సీతారామన్‌ తోపాటు తదితరులపై బెంగళూరు తిలక్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

2018లో కేంద్రం ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ బాండ్ల కింద ఆయా రాజకీయ పార్టీలకు ఎవరైనా విరాళాలు అందించవచ్చు. రాజకీయ పార్టీలకు ఆయా వ్యక్తులు, సంస్థలు ఇచ్చే విరాళాల్లో పారదర్శకత కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని కేంద్రం చెప్పుకుంది. అయితే, ఫిబ్రవరిలో, సుప్రీంకోర్టు ఈ పథకాన్ని ‘రాజ్యాంగ విరుద్ధం‘ అని స్పష్టం చేసింది. అంతేకాకుండా పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడింది.

కాగా ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంలో తనతోపాటు నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్‌ చేయడంపై కేంద్ర కేబినెట్‌ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మండిపడ్డారు. ఎలక్టోరల్‌ బాండ్లలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో తాను, ఆమె ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు.