బీజేపీ లీడర్ కి 7 సెకన్లలో 5 సార్లు నమస్కారం... మహిళా ఐఏఎస్ వీడియో వైరల్!

స్థానిక బీజేపీ నేతకు సుమారు ఏడు సెకన్ల వ్యవధిలో ఐదు సార్లు నమస్కరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Update: 2024-10-26 04:17 GMT

రాజస్థాన్ లో విధుల్లో ఉన్న ఐఏఎస్ అధికారి ఒకరు.. స్థానిక బీజేపీ నేతకు సుమారు ఏడు సెకన్ల వ్యవధిలో ఐదు సార్లు నమస్కరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో... రాజకీయ నాయకుడి ముందు ఆమె వ్యవహరించిన తీరుపై ఇప్పుడు నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వక్తమవుతున్నాయి.

అవును... ఒక కార్యక్రమంలో రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియాకు బార్మర్ జిల్లా కలెక్టర్ టీనా దాబీ ఎదురయ్యారు. ఈ సందర్భంగా కారు దిగిన తర్వాత సతీష్ పూనియా ఫోన్ చూసుకుంటూ బిజీగా ఉన్నట్లు కనిపించారు. అయినప్పటికీ కలెక్టర్ టీనా.. పలుమార్లు నమస్కరిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా... 7 సెకన్లలో 5సార్లు నమస్కరించడం గమనార్హం.

అయితే ఆఖరికి సతీష్ పూనియా ఆమె వైపు చూసి ఆమె అభివాదాన్ని స్వీకరించారు. అప్పుడు ఆమె కాస్త రిలాక్స్ అయినట్లున్నారు! అనంతరం.. బార్మర్ జిల్లా కలెక్టర్ గా ఆమె గొప్పగా పనిచేస్తున్నారని.. ఆమె పనితనం వల్ల బార్మర్ ఇప్పుడు ఇండోర్ తరహాలో మారుతుందని.. ఆమె మంచి పని చేస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో.. ఆమె మరోసారి అతడికి నమస్కరించారు.

ఇలా నమస్కారాలు, ప్రశంసలతో నిండిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది! ఈ సమయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా... రాజకీయ నాయకుడి ముందు ఆమె వ్యవహరించిన తీరును పలువురు తీవ్రంగా విమర్శిస్తుండగా.. మరికొంతమంది ఆమె చర్యను ప్రశంసించారు.

ఇందులో భాగంగా... తల వంచుకోవడంలో తప్పు లేదని.. ప్రజాప్రతినిధులే అధికారుల కంటే గొప్పవారని.. ఆమె ప్రవర్తన మంచి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశారు. తన పరిపాలనా దక్షతతో దేశంలో మంచి పేరు గడించిన ఆమె.. ఓ రాజకీయ నాయకుడి ముందు ఇంతగా తల వంచాల్సిన అవసరం లేదని మరో యూజర్ స్పందించారు.

కాగా... 2015లో ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే టాపర్ గా నిలిచారు టీనా దాబీ. ఈ నేపథ్యంలో 2017లో అజ్మీర్ జిల్లా కలెక్టర్ గా ఆమె తన కెరీర్ ప్రారంభించారు.

Tags:    

Similar News