వీడియో: నిరసనలయందు ఈ నిరసన వేరయా.. యముడు రోడ్డెక్కాడయా!
గుంతలు పడిన రోడ్లపై ద్విచక్ర వాహనంతో వెళ్తుంటే ఒళ్లు హూనం అయిపోతుంటుంది.. ఇక చతుచక్ర వాహనంపై వెళ్తే చెప్పేపనే లేదు.
రోడ్లపై గుంతలు అనే టాపిక్ గురించి భారతదేశంలో ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటుంటారు అనుభవజ్ఞులు! గుంతలు పడిన రోడ్లపై ద్విచక్ర వాహనంతో వెళ్తుంటే ఒళ్లు హూనం అయిపోతుంటుంది.. ఇక చతుచక్ర వాహనంపై వెళ్తే చెప్పేపనే లేదు. ఫిజియో థెరఫీ ట్రీట్ మెంట్ కూడా ఆ ఇబ్బందిని నయం చేయలేదని చెబుతుంటారు.
పాలకుల అలసత్వమో.. గుత్తేదార్ల చాణక్యమో... కారణం ఏదైనా భారత దేశంలో రోడ్ల పరిస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. ఇక వర్షాకాలం వస్తే ఆ గుంతల్లో నీళ్లు నిండి.. ఎక్కడ ఏ స్థాయిలోతు గుంట ఉందో తెలియక వాహదారులు సర్కస్ ఫీట్లు చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికరమైన సంఘటన తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... ఓ రహదారి గుంతలమయమై, నీటితో నిండిపోయి ఉంది. దీంతో... ఆ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదలు జరుగుతుండటం, గాయపడుతుండటం, మరణిస్తుండటం జరుగుతుందంట. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలకు ఎన్నిసార్లు మొత్తుకున్నా విన్నవించుకోవడంలేదో ఏమో కానీ... కొంతమంది వినూత్న నిరసన చేపట్టారు.
అవును... రోడ్లపై గుంతలు పడి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పినా అటు అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదో ఏమో కానీ.. కొంతమంది వ్యక్తులు ఈ గుంతల్లో యముడు.. ఆత్మలకు లాంగ్ జంప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా యముడి వేషదారణలో ఉన్న వ్యక్తి నీటితో నిండిన గుంతల వద్ద ఆత్మలకు లాంగ్ జంప్ పోటీలూ నిర్వహించాడు. ఇందులో భాగంగా... ఆ రోడ్డు వద్ద మరణించి దెయ్యాలుగా మారిన వ్యక్తులు పరుగెత్తుకుని వచ్చి ఆ గుంతలపై నుంచి జంప్ చేస్తున్నారు. తర్వాత.. ఆ జంప్ చేసిన దూరాన్ని చిత్రగుప్తుడి గెటప్ లో ఉన్న వ్యక్తి కొలుస్తున్నాడు.
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ వినూత్న నిరసనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో... నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.. అధికారులపైనా, ప్రభుత్వ పెద్దలపైనా మండిపడుతున్నారు. ఇప్పటికైనా మరమ్మత్తులు చేపట్టలాని డిమాండ్ చేస్తున్నారు!