చంద్రబాబు గ్రేట్.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఏపీ సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.;

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఏపీ సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. అరకు కాఫీకి బ్రాండింగ్ తేవడంలో చంద్రబాబు మార్కెటింగ్ వ్యూహం ప్రశంసిస్తూ ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నాందీ ఫౌండేషనుకు కూడా చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆనంద్ మహీంద్ర ప్రపంచంలో అరకు కాఫీ సాధిస్తున్న గుర్తింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమంటూ ఆకాశానికెత్తేశారు. దీంతో ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్ అవుతోంది.
ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు అద్భుతమంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేయడం చర్చకు దారితీస్తోంది. నాంది ఫౌండేషన్ ద్వారా అరకు కేఫ్ లను విస్తరిస్తున్న తీరు చూసి సీఎం చంద్రబాబు సంతోషిస్తారని మహీంద్ర అభిప్రాయపడ్డారు. పారిస్ కేఫ్ ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్స్ పై అరకు గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శిస్తున్నట్లు ఆయన చెప్పాడు. ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్ ని గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు వివరించారు.
అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. ఇందుకోసం పారిశ్రామిక వేత్తలతో కూడిన నాంది ఫౌండేషన్ ను సీఎం చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. తొలి నుంచి అరకు కాఫీని ప్రమోట్ చేస్తున్న నాంది ఫౌండేషన్ కు మహీంద్ర చైర్మన్ గా ఉన్నారు. భారత దేశం వెలుపల ప్యారిస్ లో అరకు కాఫీ స్టాల్ ను మహీంద్ర సారథ్యంలోనే ప్రారంభించారు. త్వరలో రెండో స్టాల్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చొరవను గుర్తుచేస్తూ మహీంద్ర ట్వీట్ చేయడం వైరల్ అవుతోంది.
ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి సిద్ధమైన ఆర్గానిక్ కాఫీని అరకులో పండిస్తున్నారు. దాదాపు లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో పండిస్తున్న అరకు కాఫీని మరింత ఎక్కువగా సాగు చేయడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అరకు కాఫీని మార్కెటింగు చేయడానికి అసెంబ్లీ, పార్లమెంటుల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయించారు.
దేశంలో 12 రాష్ట్రాలు కాఫీని ఉత్పత్తి చేస్తుండగా, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అరకు కాఫీని ఏపీ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. అత్యంత నాణ్యమైన కాఫీ గింజలు ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సేంద్రియ పద్ధతుల్లో పండించడంతో ఇక్కడి కాఫీ పంటకు డిమాండ్ చాలా ఎక్కువ. సముద్ర మట్టానికి 3600 ఎత్తులో గిరిజన కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో పండిస్తారు. వీటిన్నటికీ ప్రచారమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, అందుకు తగ్గట్టే నాంది ఫౌండేషన్ కూడా కృషి చేస్తోంది.