పని గంటలకు సరైన కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటూ.. తన ఆలోచనల్ని.. అభిరుచుల్ని పంచుకునే ఆయన.. పని గంటల మీద తాజాగా పెదవి విప్పారు.

Update: 2025-01-12 06:42 GMT

రోజుకు ఉన్న 24 గంటల్లో ఎనిమిది గంటల నిద్ర అవసరమని ప్రతి ఒక్క వైద్యుడు చెప్పేదే. దాన్ని మినహాయిస్తే ఉండే 16 గంటల టైంలో తినేందుకు.. కాలకృత్యాలు తీర్చుకోవటానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. పదహారు గంటల సమయంలో ఈ మూడు గంటలు తీసేస్తే 13 గంటలు మిగులుతుంది. మనిషి అన్న తర్వాత ఉండే అంశాలు.. విషయాలతో పాటు.. బతికేందుకు.. కెరీర్ లో స్థిరపడేందుకు.. అవసరమైన పని చేయటాన్ని ఎవరూ కాదనరు. కానీ.. ఇన్నేసి గంటలు పని చేయాలంటూ సమాజం మీద ప్రభావాన్ని చూపే వారి సలహాలు ఇచ్చేస్తేనే అసలు ఇబ్బంది.

ఇప్పటికే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రమణ్యన్ తో పాటు పలువురు అధికంగా పని చేయాలని.. పని గంటలు పెరగాలంటూ వ్యాఖ్యానించటంతో.. పని గంటల మీద చర్చ మొదలైంది. ఇలాంటి వేళ.. ఆనంద్ మహీంద్రా స్పందించారు. సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటూ.. తన ఆలోచనల్ని.. అభిరుచుల్ని పంచుకునే ఆయన.. పని గంటల మీద తాజాగా పెదవి విప్పారు.

ఢిల్లీలో ఏర్పాటుచేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో పని గంటల పొడిగింపుపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని చూసినప్పుడు ఇది కదా.. కావాల్సింది. ఇలా కదా ఆలోచించాల్సిందన్న భావన కలుగక మానదు. అధిక పని గంటలు పని చేయటం కంటే కూడా అసలేం చేయాలన్న దానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి మనసుల్ని దోచేలా ఉన్నాయని చెప్పాలి.

‘నారాయణమూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నా ఉద్దేశం ఏమంటే.. మనం పని గంటల పై కాకుండా.. పని నాణ్యతపై ఫోకస్ చేయాలి. కాబట్టి వారానికి 70 గంటలు.. 90 గంటలు కాదు నాణ్యమైన పని పది గంటలు చేస్తే చాలు.. ప్రపంచాన్నే మార్చేయొచ్చు’ అంటూ తన ఆలోచనల్ని సూటిగా.. స్పష్టంగా వెల్లడించారు. అంతేకాదు.. తాను సోషల్ మీడియాలో గడిపినంత మాత్రాన ఖాళీగా ఉన్నట్లు కాదన్న ఆయన.. తనకు తన భార్యను తదేకంగా చూడటం చాలా ఇష్టమంటూ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.

ఎక్కువ పని గంటలు పని చేయాలన్న చర్చకు మూలం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ఆయనో పాడ్ కాస్ట్ లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే ఇతర దేశాలతో పోటీ పడేందుకు వారానికి 70 గంటలు పని చేయాల్సి ఉందన్నారు. భారతదేశంలో పని ఉత్పాదకత.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్.. జర్మనీ చేసినట్లుగా భారత యువకులు ఎక్కువ గంటలు పని చేస్తే పరిస్థితిని మరింత మెరుగుపడొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తప్పుపట్టగా.. ఆనంద్ మహీంద్రా మాత్రం.. విమర్శ కంటే కూడా పని గంటల పెంపునకు భిన్నంగా అనుసరించాల్సిన మార్గాన్ని చెప్పటం ఆసక్తికరంగా ఉందని చెప్పాలి.

Tags:    

Similar News