అదే జరిగితే.. మా కంపెనీ మూసేస్తాం: ఆనంద్ మహీంద్రా సంచలన కామెంట్స్
ఆనంద్ మహీంద్ర.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మహింద్రా కార్లు, జీపుల తయారీ కంపెనీ అధినేతగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందారు
ఆనంద్ మహీంద్ర.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మహింద్రా కార్లు, జీపుల తయారీ కంపెనీ అధినేతగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందారు. అంతేకాదు.. సమకాలీన అంశాలపై ఆయన తరచుగా స్పందిస్తూ..నెటిజన్లతో తన అభిప్రాయాలను పంచుకుంటారు. తద్వారా ఆయన నెటిజన్లకు కూడా.. చిరపరిచయస్తులే. కాగా, తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.''అదే జరిగితే.. మా కంపెనీని మూసేయాల్సి ఉంటుంది.. మేం దివాలా తీయడం ఖాయం'' అని మహింద్రా కామెంట్స్ చేశారు. మరి ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఇంత సీరియస్ కామెంట్లు చేశారు? అనేది ఆసక్తిగా మారింది.
ఏం జరిగిందంటే..
ఆనంద్ మహీంద్రా కంపెనీకి చెందిన కార్ల గురించి.. ఓ చిన్నారి తనదైన ముద్దుముద్దు మాటలతో వ్యాఖ్యలు చేశాడు. వీడియోలో చీకూ అనే కుర్రాడు తన తండ్రితో మహీంద్రా కార్ల కొనుగోలు గురించి మాట్లాడుతూ.. మహీంద్రా థార్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఎక్స్‌యూవీ 700' మోడల్ పేరులో 700 ఉంది కాబట్టి ఏడు వందలకు కొనేయచ్చని అన్నాడు. ఈ చిన్నారి మాటల్ని తండ్రి రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా వరకూ వెళ్లింది.
ఈ వీడియోపై మహింద్రా స్పందిస్తూ.. ''నా ఫ్రెండ్ ఈ వీడియో పంపించాడు. దీంతో, అతడి ఇన్‌స్టా గ్రాం హ్యాండిల్‌లో కొన్ని వీడియోలు చూశాను. ఆ తరువాత నాకూ చిన్నారిని చూస్తే ముచ్చటేసింది. కానీ చిన్నారి చెప్పిన లాజిక్‌ను అంగీకరించి థార్‌ను 700 వందలకే అమ్మితే మేం అతిత్వరలో దివాలా తీసేస్తాం. కంపెనీని కూడా మూసేస్తాం’’ అని కామెంట్ చేశారు.
ఇదిలావుంటే, ఆనంద్ మహీంద్రా పోస్ట్‌పై నెటిజన్లు కూడా స్పందించారు. చిన్నారి మాటలు నిజమైతే బాగుండునని పలువురు వ్యాఖ్యానించారు. థార్ 700లకే దొరికితే బాగుండని కామెంట్ చేశారు. కుర్రాడిని మహీంద్రా ఎస్‌యూవీ కార్లకు బ్రాండ్ అంబాసిడర్ చేయాలని మరికొందరు పేర్కొన్నారు.