అంబానీ లండ‌న్ వేడుక‌లు మీడియా ఊహాగానాలే

అయితే ఈ పుకార్లకు తెర దించుతూ ఊహాగానాలకు ముగింపు పలుకుతూ హోటల్ ఇప్పుడు ఓ ప్రకటన విడుదల చేసింది.

Update: 2024-07-27 13:49 GMT

ఆసియ‌న్ నంబ‌ర్.1 ధ‌న‌వంతుడు ముఖేష్ అంబానీ వార‌సుడు అనంత్ అంబానీ తన చిరకాల స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను 12 జూలై 2024న ముంబయిలో వివాహం చేసుకున్నాడు. దీని తరువాత అంబానీలు లండన్‌లో వరుస వివాహ వేడుకలను నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. దీనికోసం ఏకంగా 6000 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని, లండ‌న్ స్టోక్ పార్క్ హోట‌ల్లో జ‌రిగే వేడుక‌ల కోసం పెళ్లి వేడుక‌ల‌కు మించి ఖ‌ర్చ‌వుతుంద‌ని ప్ర‌ముఖ ఆంగ్ల మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి. అయితే ఈ పుకార్లకు తెర దించుతూ ఊహాగానాలకు ముగింపు పలుకుతూ హోటల్ ఇప్పుడు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో విలాసవంతమైన సెవెన్ స్టార్ హోటల్ ఆ వార్త‌ల‌ను ఖండించింది. ఈ వేసవిలో తన ఎస్టేట్‌లో ఎటువంటి వివాహ కార్యక్రమాలను నిర్వహించబోదని స్పష్టం చేసింది. స్టోక్ పార్క్‌లో జ‌రిగే ప్రైవేట్ విష‌యాల‌పై మేము సాధారణంగా వ్యాఖ్యానించము. కానీ ఇటీవలి మీడియా ఊహాగానాలు వెలువ‌డ్డాయి గ‌నుక‌..క‌చ్చితత్వం కోసం ప్ర‌క‌టిస్తున్నాం. ఎస్టేట్‌లో ఎటువంటి వివాహ వేడుకలు ప్లాన్ చేయలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము`` అని హోట‌ల్ నోట్ లో వెల్ల‌డైంది. ఎప్పటిలాగే మేం ఎస్టేట్ కోసం ప్రపంచ స్థాయి హోటల్ .. గోల్ఫ్ కోర్స్ కోసం మా భవిష్యత్తు దృష్టికి కట్టుబడి ఉన్నాము. సౌక‌ర్యాల‌ను అందించడానికి మా వాటాదారులు .. స్థానిక సంఘంతో కలిసి పని చేస్తూనే ఉంటాము.. అని ఈ నోట్ లో పేర్కొన్నారు.

అనంత్ అంబానీ- రాధికల మ‌ధ్య‌ సంబంధం ఆరేళ్లుగా ఉంది. అనంత‌రం ఇరువైపులా పెద్ద‌లు పెళ్లిని నిశ్చ‌యించారు. డిసెంబరు 2022లో వారి రోకా వేడుక జరిగింది. జనవరి 2023లో ముంబైలో జరిగిన గోల్ ధన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహానికి ముందు వేడుకలు మార్చి 2024లో జామ్‌నగర్‌లో ప్రారంభమయ్యాయి. అంబానీ కుటుంబం జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన హల్దీ, మెహందీ, సంగీత్, వివాహం, రిసెప్షన్ కోసం ముంబైకి తిరిగి వచ్చారు. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా శుభ ఆశీర్వాద్ వేడుకకు హాజరయ్యారు. వివాహ వేడుకలో కిమ్ కర్దాషియాన్ -ఖోలే కర్దాషియాన్ వంటి అమెరికన్ ప్రముఖులు కూడా ఉన్నారు. జూలై 12న ముంబైలో వారి వివాహం.. రిసెప్షన్‌లు .. వివాహానంతర కార్యక్రమాలు వ‌రుస‌గా జ‌రిగాయి. నూతన వధూవరులు 15 జూలై 2024న జామ్‌నగర్‌ను తిరిగి సందర్శించారు. అక్కడ వారి బంధుమిత్రులు అంబానీ కుటుంబీకుల స‌హా అనేక మంది శ్రేయోభిలాషుల నుండి సాదర స్వాగతం లభించింది. ఈ వేడుక‌ల‌న్నిటి కోసం ఏకంగా 5000 కోట్లు ఖ‌ర్చు చేసిన అంబానీల‌కు బ‌జ్ పెర‌గ‌డంతో స్టాక్ మార్కెట్ జోరు పెరిగి రిల‌య‌న్స్ సంస్థ‌ల షేర్ విలువ పెర‌గ‌డం ద్వారా 25000 కోట్ల ఆదాయం వ‌చ్చింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

Tags:    

Similar News