84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్ష... ఎవరీ డాక్టర్?
ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిదో తరగతి పరీక్ష పాసవ్వాలని ఫిక్సయ్యారు ఓ పెద్దాయన.
అరుదుగా జరిగే వాటిని అద్భుతాలు అంటారు.. అత్యంత అరుదుగ జరిగే వాటిని అత్యద్భుతాలు అంటారనుకుంటే... ఇప్పుడు చెప్పుకోబోయే విషయం కూడా దాదాపు ఈ కోవలోకే వస్తుందని భావించొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిదో తరగతి పరీక్ష పాసవ్వాలని ఫిక్సయ్యారు ఓ పెద్దాయన. ఆయన పట్టుదల ఈ జనరేషన్ కి ఇన్సిపిరేషన్ అని అంటున్నారు నెటిజన్లు.
స్కూల్ కి వెళ్లమంటే మారాం చేసే పిల్లలు, బుక్స్ తీయమంటే రచ్చ చేసి విద్యార్థుల సంఖ్య ఈ రోజుల్లో పెరిగిపోతుందని అంటుంటారు. చదువుపై శ్రద్ధ తగ్గిపోయి.. సెల్ ఫోన్, సోషల్ మీడియా వైపు నేటి తరం పిల్లలు ఎక్కువగా ఆసక్తిచూపిస్తున్నారని.. విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని చెబుతుంటారు.
అయితే.. 84 ఏళ్ల వయసులో కూడా పట్టువదలని విక్రమార్కుడిలా 8వ తరగతి పరీక్ష రాస్తున్నారు ఓ పెద్దాయాన. అవును... మధ్యప్రదేశ్ లోని ఛింద్ వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పైగా ఇప్పుడు ఎనిమిదో తరగతి పాసయ్యాక టెన్త్, ఇంటర్ కూడా పూర్తి చేస్తానని చెబుతున్నారు.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఆయన... చదువుకు వయసుతో సంబంధం లేదని భావించినట్లు చెప్పారు. అందుకే తాను మొదట మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి ఐదో తరగతి పరీక్షలు రాసినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నట్లు తెలిపిన ఆయన... ఆ తర్వాత 10, ఇంటర్ కూడా పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఆయుర్వేద వైద్యంలో మంచి పట్టు సంపాదించిన ప్రకాశ్.. సామాన్యుల నుంచి అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, అనేక దేశాల వ్యాపారవేత్తలకు సేవలు అందించారట. ఈ క్రమల్మోనే సుమారు 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు చికిత్స చేశారని చెబుతున్నారు.