విపత్తులోనూ మోడీ భజన.. ఏపీ నేతలపై విమర్శలు!
అధినాయకులను ప్రశంసించవచ్చు. పొగడ్తల వర్షం కూడా కురిపించవచ్చు. కానీ, అది రాష్ట్రంలో కీలకమైన సమస్యలు లేనప్పుడు చేయాల్సిన పని.
అధినాయకులను ప్రశంసించవచ్చు. పొగడ్తల వర్షం కూడా కురిపించవచ్చు. కానీ, అది రాష్ట్రంలో కీలకమైన సమస్యలు లేనప్పుడు చేయాల్సిన పని. కానీ, ఏపీలో పరిస్తితి చాలా ఇబ్బందిగా ఉంది. వరద ప్రభావిత విజయవాడ ఇంకా కోలుకోలేదు. ప్రధాన రహదారులు మాత్రమే బాగున్నాయి తప్ప.. ప్రజలు నివసించే ప్రాంతాలు ఇంకా మోకాల్లోతు మురికినీటిలో కొనసాగుతున్నాయి. వారికి ఎంతవరకు సాయం చేస్తారో.. ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రధాన అధికార పార్టీ టీడీపీ సాయంపై ప్రకటనలుచేస్తున్నా.. చేతిలో చిల్లిగవ్వలేదని మంత్రులు చెబుతున్నారు.
మరోవైపు ఏలేరు రిజర్వాయర్ కారణంగా పిఠాపురం సహా.. కాకినాడలోని 65 గ్రామాలూ జలదిగ్బంధంలోనే ఉన్నా యి. ఇలాంటి సమయంలో అందరి చూపూ.. రాష్ట్రంలోని బీజేపీ నేతలపైనే ఉంది. తాజాగా బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అధ్యక్షతన విజయవాడలో మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా.. ఏపీ పరిస్థితులపై చర్చిస్తారని అందరూ అనుకున్నారు. మరీ ముఖ్యంగా డెలిగేషన్‌గా ఏర్పడి కేంద్రానికి నివేదిక ఇస్తారని.. సాయం త్వరగా చేసేలా చూస్తారని భావించారు. కానీ.. ఈ సమావేశం మొత్తం.. మోడీ భజనతోనే సరిపోయింది.
``దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మేలు చేయడమే బీజేపీ విధానం. ప్రధాని మోడీ సారధ్యంలో దేశ ప్రజల సంతోషంగా ఉన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డు కు మార్పులు చేర్పులు వంటి అంశాలను ధైర్యంగా మోడీ అమలు చేశారు. యన్డీఎ ప్రభుత్వం ఎపీ అభివృద్ది కి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదు. అమరావతి రాజధాని అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉంది. 2500 కోట్లు నేరుగా నిధులు కూడా గతంలో మంజూరు చేసింది. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు డిపిఆర్ ఓకే చేశారు. అంతర్గత రోడ్ల విస్తరణకు గడ్కరీ ఆమోదం తెలిపారు`` అంటూ.. స్వయంగా పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
ఎక్కడా కూడా విజయవాడ, కాకినాడ, గుంటూరు, బాపట్ల వరద బాధితుల గురించిన ప్రస్తావనే లేకుండాపోయింది. వారికి చేసే సాయంపై కూడా ఎవరూ నోరు విప్పలేదు. బాధితులకు బీజేపీ పక్షాన ఏమైనా సాయం చేసి ఉంటే దానిని కూడా చెప్పలేదు(సాయం చేయలేదని భావించాలి). కనీసం.. ప్రభుత్వం చేపడుతున్న సాయానికి తమ వంతు సాయం చేస్తామని కూడా కమల నాథులు ప్రకటించలేక పోయారు. ఈ విషయాలే ఇప్పుడు విమర్శలకు దారి తీస్తున్నాయి. రాష్ట్రం ఒక పక్క ఇబ్బందుల్లో ఉన్నా..ఈ భజనలేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.